ఏడాదిగా గాయాలతో సహజీవనం చేస్తున్న భారత స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. 2019 వరల్డ్‌కప్‌లో గాయపడిన భువనేశ్వర్‌ కుమార్‌.. గత డిసెంబర్‌లో చివరగా భారత్‌ తరఫున మెరిశాడు.

వరల్డ్ కప్ గాయం తరవాతి నుంచి భువనేశ్వర్ టీం లోకి రావడం మరల గాయం తిరగబెట్టి వెళ్లడమో లేదా, ఫిట్నెస్ సంబంధిత సమస్యో, లేదా ఏదైనా కొత్త గాయం కారణంగానో టీంలో మాత్రం నిలకడగా కొనసాగలేకపోతున్నారు. 

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఆడిన భువనేశ్వర్‌ కుమార్‌ గజ్జల్లో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. స్పోర్ట్స్‌ హెర్నియా గాయం తిరగబెట్టడంతో భువనేశ్వర్‌ కుమార్‌ లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 

సర్జరీ అనంతరం బెంగళూర్‌లోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమి (ఎన్‌సీఏ)లో రిహబిలిటేషన్‌లో కొనసాగాడు. లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి ఫిట్‌నెస్‌ అందుకున్న భువనేశ్వర్‌ కుమార్‌ మైదానంలో మెరిసేందుకు ఉత్సాహంతో ఉన్నాడు. 

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని, అథ్లెట్‌గా ఇండోర్‌ లోనే ఉండడం, ఇంటికే పరిమితం అవటం కష్టమైన విషయమని భువనేశ్వర్ అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ద వహించటం అవసరమని భువనేశ్వర్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇకపోతే... 2021 జులైలో లార్డ్స్‌ వేదికగా జరగాల్సిన తొట్ట తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా వాయిదా పడనుంది. కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ క్రికెట్‌ ఇప్పటికే సుమారు 90 రోజుల షెడ్యూల్‌ నష్టపోయింది. 

మ్యాచ్‌ల నిర్వహణతోనే ప్రధానంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రికెట్‌ బోర్డులకు ఇది ప్రాణ సంకటంగా మారింది. కరోనా వైరస్‌ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత క్రికెట్‌ బోర్డులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఊతం అందించే వన్డే, టీ20 ఫార్మాట్లపైనే దృష్టి సారించటం మేలని భారత క్రికెట్‌ పెద్దలు భావిస్తున్నారు. 

అందుకే 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా కార్యదర్శి జై షా హాజరయ్యారు. 

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కీలక టెస్టు సిరీస్‌లు ఈ సమయంలోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్‌-19తో సాధ్యపడలేదు. దీంతో టెస్టు చాంపియన్‌షిప్‌ను షెడ్యూల్‌ను వాయిదా వేయాలని సీఈసీ సమావేశంలో జై షా అభిప్రాయపడ్డారు.