పునరాగమనాన్ని ఘనంగా చాటిన సర్ జడేజా.. కమ్‌బ్యాక్ కింగ్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు
BGT 2023: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో జడేజా స్పిన్ మాయాజాలానికి ఆసీస్ బ్యాటర్లు దాసోహమయ్యారు.

సుమారు ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు. జడ్డూ మెరవడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ జడేజాను ‘కమ్‌బ్యాక్ కింగ్’అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
నాగ్‌పూర్ టెస్టుకు ముందు జడేజా.. గతేడాది ఆగస్టులో జరిగిన ఆసియాకప్ లో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ టోర్నీలో పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడిన జడేజా.. తర్వాత కాలిగాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్ లతో పాటు కీలకమైన టీ20 ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది.
కాలికి గాయం తర్వాత జడేజా.. తన భార్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవగా తన తరఫున ప్రచారం చేశాడు. వాస్తవానికి జడేజా.. గతేడాది డిసెంబర్ లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకే టీమ్ లో కలవాల్సి ఉండగా.. ఫిట్నెస్ ఇష్యూ అని చెప్పి ఆ టూర్ కు వెళ్లలేదు. ఆ తర్వాత గత నెలలో రంజీలలో ఎంట్రీ ఇచ్చి బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సిద్దమయ్యాడు.
నాగ్‌పూర్ టెస్టులో..
నాగ్‌పూర్ టెస్టుకు ముందు రంజీల ద్వారా కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ పొందిన జడ్డూ.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు ముచ్చెమటలు పట్టించాడు. 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను స్మిత్, లబూషేన్ లు ఆదుకున్నారు. లంచ్ వరకూ ఈ ఇద్దరూ.. భారత బౌలర్లను విసిగించారు. స్పిన్ ఆడేందుకు ప్రిపేర్ అయి వచ్చిన ఈ ఇద్దరు బ్యాటర్లు అశ్విన్, అక్షర్ పటేల్ లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. అయితే జడేజా ముందు వారి ఆటలు సాగలేదు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని జడేజా విడదీశాడు. అద్భుత డెలివరీతో లబూషేన్ ను బోల్తా కొట్టించిన జడ్డూ.. ఆ వెంటనే రెన్షాను కూడా ఔట్ చేశాడు. ఇక స్మిత్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బాల్ తొలి రోజు హైలైట్.
మూడు వికెట్లతో ఆసీస్ కు షాకిచ్చిన జడ్డూ.. ఆ తర్వాత హ్యాండ్స్‌కాంబ్, మర్ఫీల పని పట్టి ఆసీస్ పతనంలో కీలకపాత్ర పోషించి ఐదు వికెట్లతో మెరిశాడు. టెస్టులలో జడ్డూకు ఇది 11వ ఐదు వికెట్ల ప్రదర్శన. నేటి ఆటలో జడ్డూ బౌలింగ్ తో పాటు అతడి హెయిర్ స్టైల్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. జడ్డూ బౌలింగ్ కు కుదేలైన ఆసీస్ ను చూసి అభిమానులు ట్విటర్ లో.. ‘మీరు అశ్విన్, అక్షర్ లను ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయి వస్తే మేం సర్ జడేజాతో మీకు చెక్ పెట్టాం..’అని కామెంట్స్ చేస్తున్నారు.