Asianet News TeluguAsianet News Telugu

పడగొట్టారు.. నిలబడ్డారు.. నాగ్‌పూర్ టెస్టులో తొలి రోజు భారత్‌దే..

Border Gavaskar Trophy 2023: భారత్ - ఆస్ట్రేలియాల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  మొదటి రోజు అదరగొట్టింది. బౌలింగ్ లో  ఆసీస్ పనిపట్టిన టీమిండియా.. తర్వాత  బ్యాటింగ్ లో కూడా నిలకడగా ఆడుతోంది. 

BGT 2023: Australia All Out at 177, Rohit Sharma and KL Rahul gave Good Start to India MSV
Author
First Published Feb 9, 2023, 5:02 PM IST

టీ20లు, వన్డేలు సరే.. టెస్టులలో భారత్ ఎలా ఆడుతుందో..?  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు  చాలా మంది భారత క్రికెట్ అభిమానులకు ఈ  అనుమానమే మదిలో మెదిలింది. గతేడాది  భారత్.. ఆరు టెస్టులు మాత్రమే ఆడటమే దీనికి ప్రధాన కారణం. అదీగాక  ఆడేది కఠినమైన ఆస్ట్రేలియా ప్రత్యర్థి కావడంతో  మన క్రికెటర్లు ఎలా ఆడతారోననే  అందరిలోనూ సందేహం.  కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ  రోహిత్ సేన తొలి రోజే అదరగొట్టింది.  బౌలింగ్ లో ఆసీస్ ను తక్కువ స్కోరుకే పడగొట్టి   బ్యాటింగ్ లో  ఆ జట్టు స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కుంటున్నది. 

నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో ఆసీస్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.   అయితే  కమిన్స్  నిర్ణయం  తప్పని భారత బౌలర్లు  ఆదిలోనే  ప్రూవ్ చేశారు.  స్కోరుబోర్డుపై పట్టుమని పది పరుగులు  కూడా చేరకుండానే  ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాట పట్టారు. 

ఆదుకున్న  స్మిత్, లబూషేన్.. 

తొలుత సిరాజ్.. ఉస్మాన్ ఖవాజా (1)ను ఎల్బీడబ్ల్యూ ద్వారా ఔట్ చేయగా  డేవిడ్ వార్నర్  (1) ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండు పరుగులకే రెండు వికెట్లు. ఈ దశలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (107 బంతుల్లో 37, 7 ఫోర్లు), మార్నస్ లబూషేన్ (123 బంతుల్లో 49, 8 ఫోర్లు)  లు ఆసీస్ ను  ఆదుకున్నారు. ఈ ఇద్దరూ భారత సీమర్లతో పాటు స్పిన్నర్లనూ  సమర్థంగా ఎదుర్కున్నారు.   లంచ్ వరకూ ఇద్దరూ  స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.  భారత స్పిన్నర్లు కవ్వించే బంతులను వేసినా  వాటి జోలికి పోలేదు.  

తిప్పిన జడ్డూ.. 

స్మిత్ - లబూషేన్ లు కలిసి మూడో వికెట్ కు  82 పరుగులు జోడించారు.   ఈ జంట ప్రమాదకరంగా పరిణమిస్తున్న తరుణంలో  రవీంద్ర జడేజా భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అతడు వేసిన  ఆసీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ ఐదో బంతికి  లబూషేన్ ముందుకు వచ్చి ఆడాడు. కానీ  బంతి మిస్ కావడంతో   తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆంధ్రా కుర్రాడు కోన శ్రీకర్ భరత్.. వేగంగా స్పందించి  స్టంపౌట్ చేశాడు.  అదే ఓవర్లో తర్వాత బంతికి రెన్షా (0) డకౌట్ అయ్యాడు.   41వ ఓవర్లో జడేజా.. స్మిత్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.   

తోకను కత్తిరించిన అశ్విన్.. 

వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ క్రమంలో హ్యాండ్స్‌కాంబ్ (84 బంతుల్లో 31, 4 ఫోర్లు),  వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (33 బంతుల్లో 36, 7 ఫోర్లు)  మరోసారి ఆసీస్ కు అండగా నిలిచారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు  53 పరుగులు జోడించారు.   కానీ  ఈ జంటను  అశ్విన్ విడదీశాడు.  అతడు వేసిన  53వ ఓవర్ తొలి బంతికి క్యారీ బౌల్డ్ అయ్యాడు.   కమిన్స్  (6) ను కూడా  అశ్విన్ పెవిలియన్ చేర్చాడు.  మర్ఫీ (0)ని జడేజా ఎల్బీగా వెనక్కిపంపగా.. బొలాండ్ ను అశ్విన్ బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్ కు తెరదించాడు. భారత బౌలర్లలో జడేజాకు ఐదు, అశ్విన్ కు మూడు వికెట్లు పడ్డాయి. షమీ, సిరాజ్ లకు తలా ఓ వికెట్ దక్కింది. 

 

భారత్ నింపాదిగా.. 

తొలి రోజు మూడు సెషన్ల ముందే ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడంతో  ఆసీస్ స్పిన్నర్లు కూడా  ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో అని  ఆ జట్టు భావించింది.  కానీ  రోహిత్ (69 బంతుల్లో 56 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్స్), కెఎల్ రాహుల్ (71 బంతుల్లో 20, 1 ఫోర్) ఆ ఛాన్స్ ఇవ్వలేదు.  రాహుల్ డిఫెన్స్ కే ప్రాధాన్యమివ్వగా  రోహిత్   స్కోరువేగం పెంచే పని చూసుకున్నాడు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్.. సీమర్లు, స్పిన్నర్లతో మార్చి మార్చి బౌలింగ్ వేయించినా ఫలితం లేకపోయింది. కానీ తొలి రోజు ఆట  మరో రెండు ఓవర్లలో ముగియనుందనగా.. రాహుల్   మర్ఫీ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో మర్ఫీకి ఇదే తొలి వికెట్.  నైట్ వాచ్‌మన్ గా రవిచంద్రన్ అశ్విన్ (0 నాటౌట్) వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా వంద పరుగులు వెనకబడి ఉంది. మొత్తానికి అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా తొలి రోజు భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios