Asianet News TeluguAsianet News Telugu

బెన్ స్టోక్స్: ఒకప్పటి విలన్, నేటి హీరో

2017 సెప్టెంబర్ లో ఒక నైట్ క్లబ్ వద్ద ఇద్దరు వ్యక్తులతో బెన్ స్టోక్స్ గొడవపడుతున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.స్టోక్స్ ను 2017-18 యాషెస్ సిరీస్ నుంచి తప్పించింది ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు.

Ben Stokes: Villian became hero in world cricket
Author
London, First Published Sep 2, 2019, 7:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత సంవత్సరం ఆగస్టులో కళ్ళు మూసుకొని ఇలాగే గుంభనంగా కనిపించాడు. మళ్ళీ 2019 ఆగస్టులో ఇలాగే వెనక్కు వాల్చిన తలతో ఇలాగే ఇలాంటి స్థితప్రజ్ఞతతో కనిపించాడు. కాకపోతే ఈసారి తన మీద పడ్డ అపవాదును తొలిగించుకున్నానన్న సంతృప్తితో కాకుండా, దేశాన్ని యాషెస్ సిరీస్ మ్యాచ్ లో గెలిపించానన్న సంతోషంలో గర్వాంగా నిలబడ్డాడు. అతడే యాషెస్ మ్యాచ్ హీరో బెన్ స్టోక్స్. 

గత సంవత్సరం ఇదే సమయంలో బ్రిస్టల్ లోని కోర్టులో ఇలానే నిలబడ్డ స్టోక్స్ ఈ సంవత్సరం కూడా ఇదే సమయానికి ఇలానే నిలబడ్డాడు. కాకపోతే ఈ సారి సాంత్వన పొందిన వ్యక్తిగా కాకుండా యావత్తు దేశాన్ని గర్వపడే విధంగా నిలిపిన వ్యక్తిగా నిలిచాడు. 3వ యాషెస్ మ్యాచ్ లో  చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఆశలను ఈ సిరీస్ లో సజీవంగా నిలిపిన వ్యక్తిగా ఇంగ్లాండ్ దేశ ప్రజల ముందు సగర్వంగా వారి ఆశలకు ప్రతిరూపంగా నిలబడ్డాడు. 

హీడింగ్లేలో ఈ ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ సాధించిన ఈ 135 పరుగులు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ గా పేర్కోనవచ్చు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఒక్క సంవత్సరం గ్యాప్ లో ఎంత మార్పు వచ్చిందో దెగ్గరినుంచి గమనిస్తే తప్ప అర్థంకాదు. 

2017 సెప్టెంబర్ లో ఒక నైట్ క్లబ్ వద్ద ఇద్దరు వ్యక్తులతో బెన్ స్టోక్స్ గొడవపడుతున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. వాస్తవానికి అతను ఒక స్వలింగ సంపర్కులైన జంటను ఒక మూక దాడినుంచి కాపాడేందుకు ఆలా గొడవకు దిగాల్సివచ్చినప్పటికీ, ఉన్న ప్రాథమిక సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని స్టోక్స్ ను 2017-18 యాషెస్ సిరీస్ నుంచి తప్పించింది ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు. మీడియాలో ఇతని సస్పెన్షన్ ఫై అనేక నెగటివ్ ప్రచారాలను మనమందరం చూసాము కూడా. 

ఇక్కడి నుండి రెండు సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే, గేమ్ లను ముగించడంలో స్టోక్స్ పరిణితి ఎంతలా పెరిగిందంటే, ఇంగ్లాండ్ కు మొదటి వరల్డ్ కప్ అందించేంత. అక్కడితో ఆగకుండా, అసాధ్యం అనుకున్న దశలో 3వ యాషెస్ మ్యాచ్ లో ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే, సిరీస్ నే కోల్పోయే ప్రమాదంలో పడ్డ ఇంగ్లాండ్ ను సిరీస్ పోరులో నిలిపాడు. 

ఈ మ్యాచ్ లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ ను గనుక గమనిస్తే మనకు అతనికి అకుంఠిత దీక్ష ప్రస్ఫుటంగా కనపడుతుంది. ముగింపు దశలో అతను తన శతకాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకోకుండా, అది వదిలేయండి కనీసం పూర్తయిందని పట్టించుకోకుండా పూర్తిగా గేమ్ లో లీనమైపోయాడు. మామూలుగా సెంచరీ కొట్టిన ఏ ఆటగాడైనా హెల్మెట్ తీసి దాన్ని ముద్దాడడం సర్వ సాధారణం. కానీ దానికి భిన్నంగా, పూర్తిగా టీంను గెలిపించాలన్న కృతనిశ్చయంతో అతను ఆడిన విధానం ప్రశంసనీయం. 

ఒత్తిడిలో ఆడుతున్న సమయాల్లో, క్లోజ్ గేమ్స్ ని ఫినిష్ చేసే విషయాల్లో అందరూ ధోనిలాగా కూల్ గా ఉండలేరు కదా. వారు ఆ ప్రెషర్ కి లోనై పెర్ఫార్మన్స్ విషయంలో రాజీ పడడం జరుగుతుంది. క్రికెట్ లో ఇలాంటి సందర్భాల్లో క్రికెటర్లు తమ వికెట్లను ప్రత్యర్థి బౌలర్లకు సమర్పించుకోవడం మనకు సుపరిచితమే. ఇలాంటి ఒత్తిడిలో ఆడాలంటే ప్లేయర్ శారీరకంగా, మానసికంగా ఎంతో ధృడంగా ఉండాలి. అప్పుడు మాత్రమే తన న్యాచురల్ గేమ్ ను ఆడగలుగుతాడు. ఇలాంటి కండిషన్లలో కూడా కొంచం కూడా కన్సన్ట్రేషన్ కోల్పోకుండా, తథేదకంగా ఆటపైన దృష్టి నిలిపి తన టీం ను గెలిపించిన స్టోక్స్ ను సూపర్ అథ్లెట్ అనక తప్పదు. 

ఇతని హీరోయిజాన్ని ఇప్పుడు యావత్తు ఇంగ్లాండ్ వేనోళ్ళా కీర్తిస్తుంది. ఇతను అప్పుడు రక్షించిన జంటైతే, ఏకంగా 'సర్'  బిరుదును ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇంగ్లాండ్ టీం రాతను మారుస్తూ టీంను గెలుపుతీరాలకు చేర్చిన ఇతని ఇన్నింగ్స్ ను గతంలో ఇంగ్లాండ్ ను గెలిపించిన అనేక ఇన్నింగ్స్ లతో పోల్చి చూస్తున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా 1981లో ఇదే గ్రౌండ్ లో సర్ ఇయన్ బోథమ్ ఆడిన ఇన్నింగ్స్ తో పోల్చి చూసుకొని తెగ సంబరపడిపోతున్నారు. 

స్టోక్స్ ఇన్నింగ్స్ లాగానే, అప్పుడు బోథమ్ ఇన్నింగ్స్ కూడా ఇంగ్లాండ్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిందే. ఇప్పుడు 2019లో కూడా బ్రెక్సిట్ విషయంలో ఇంగ్లాండ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. యూరోపియాన్ యూనియన్ నుంచి విడిపోవడాన్ని సమర్థిస్తున్న వర్గంగా, దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గంగా  అక్కడి సమాజం నిట్టనిలువునా చీలిపోయి ఉంది. ఇలాంటి సమయంలో వారికీ ఒక ఐక్యతా చిహ్నం అత్యవసరం. ఇలాంటి చిహ్నాల వల్ల ప్రజల మధ్య ఏర్పడ్డ దూరాలు తొలిగి అంతా కలిసివుండే అవకాశాలు అధికమవుతాయి. అప్పుడు బోథమ్, ఇప్పుడు స్టోక్స్ ఇరువురు కూడా ఇలా దేశ ఐక్యతను కాపాడిన హీరోలనడంలో ఎటువంటి సంశయం అవసరంలేదు. 

1981 యాషెస్ సిరీస్ లో బోథమ్  ఆడిన ఇన్నింగ్స్ ను హీడింగ్లే అద్భుతంగా పేర్కొనవచ్చు. టీం ఓటమి తథ్యం అనుకున్న పరిస్థితుల్లో ఒక్కడై పోరాడి టీంను గెలుపు తీరాలకు చేర్చాడు. ఇప్పుడు స్టోక్స్ ఇన్నింగ్స్ ను కూడా దానితోని పోల్చడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన జాతీయ భావాన్ని రేకెత్తించడంలో అక్కడి మీడియా సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు. ఇలాంటి కథలను చెబుతూ, అక్కడి ప్రజలకు ఇలాంటి వీరోచిత గాథలను ఎప్పడికప్పుడు గుర్తుచేయడం వల్ల వారి ఇంగ్లీష్ మూలలను గుర్తుచేస్తూ, సమాజంలో ప్రజల మధ్య ఏర్పడ్డ వైషమ్యాలను తగ్గించి ప్రజలను ఏకంచేస్తుంది. 

మానవాలంతా తమ అస్థిత్వాన్ని ఏర్పరుచుకోవడం కోసం ఒక హీరో కోసం, అతని వీరోచిత గాథ కోసం వెతుక్కొంటుంది. రాజకీయంగా, ఆర్థికంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ ప్రజలను ఏకం చేసే ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకొకుండా తుదికంటా పోరాడే అతని ఆటిట్యూడ్ ఇప్పుడు ఇంగ్లాండ్ అస్తిత్వానికి ప్రతీకగా అక్కడి మీడియా ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. బెన్ స్టోక్స్ చుట్టూ పెనవేసుకున్న ఇటువంటి వీరోచిత గాధలు కేవలం ఇంగ్లాండ్ దేశానికే పరిమితమైనవి కాదు. అన్ని దేశాల్లో కూడా మనం సహజంగా చూసేవే. ఇలా టీం నుంచి ఉధ్వాసనకు గురికాకుండా ఉండి ఉంటే స్టోక్స్ ఇన్నింగ్స్ గురించి మనం ఇంతగా చర్చించుకునేవారమా చెప్పండి?

మనలో చాలామందికి ఇలాంటి వీరోచిత గాథలు వాస్తవిక పరిస్థితులనుంచి బయటపడడానికి కాసేపు ఒక విరామంగా పనికి వస్తాయి. ఏది ఏమైనా ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో టీంలోకి తిరిగివచ్చి టీంను విజయపథంలో నడిపించాడు. ఈ మ్యాచ్ ను గెలవడానికి మొత్తం ఇంగ్లాండ్ టీం కృషిచేసినప్పటికీ కూడా కేవలం బెన్ స్టోక్స్ గెలిపించిన మ్యాచ్ గానే ప్రజలు గుర్తించుకుంటారు. జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయినా మరోద్వారం తెరుచుకొనే ఉంటుందని నమ్మి, తన మీద తాను నమ్మకం కోల్పోకుండా అహర్నిశలూ తన లక్ష్యం కోసం పోరాడిన బెన్ స్టోక్స్ మనందరికీ ఆదర్శప్రాయుడు అనడంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios