ముంబై: వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్నఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సలహా ఇచ్చాడు. ప్రస్తుతం హార్డిక్ పాండ్యా ఎన్సీఎ చీఫ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతాడు. ఈ స్థితిలో హార్డిక్ పాండ్యాకు జహీర్ ఖాన్ సలహా ఇచ్చాడు. 

ఐపిఎల్ కు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటిలోగా నువ్వు 120 శాతం ఫిట్నెస్ తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నాడు. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత తిరిగి జట్టులో చేరడం ముఖ్యం కాదని, జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి వస్తుందని ఆయన అన్నాడు.

గాయాలతో జట్టుకు దూరమైనప్పుడు  ఎంతో అసహనంతో ఉంటామని, కానీ ఓపిక వహిస్తేనే తిరిగి కోలుకోగలమని, మన శరీరం మన మాట వినాలని, అందుకు ఇప్పుడునీక ఓపిక అనేది చాలా అవసరమని ఆయన అన్నాడు. సహాయ సిబ్బంది, ఫిజియో, ట్రైనర్స్ తో పాటు వైద్య సిబ్బంది మాటను కూడా పాండ్యా వినాల్సి ఉంటుందని ఆయన చెప్పాడు. 

న్యూజిలాండ్ పై టీమిండియా ప్రదర్శన మీద కూడా జహీర్ ఖాన్ స్పందించాడు. న్యూజిలాండ్ దాని సొంత గడ్డపై టీ20 సిరీస్ లో ఓడించి, సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి భారత సత్తా చాటిందని అన్నాడు. టీమిండియా 5-0 స్కోరుతో విజయం సాధించడం గొప్ప విషయమని ఆయన అన్నాడు. 

ప్రస్తుతం న్యూజిలాండ్ క్లిష్ట పరిస్థితిలో ఉందని, భారత్ ను ఎదుర్కోవడానికి న్యూజిలాండ్ ఇతర మార్గాలను అన్వేషించాలని అన్నాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కూడా కివీస్ కు సవాల్ గానే నిలుస్తుందని అన్నాడు. టీమిండియా ఇదే జోరును కొనసాగిస్తూ వన్డే, టెస్టు సిరీస్ లను కూడా గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు జట్టును గాయాలు వేధిస్తున్న రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉందని, ఈ విషయంలో జట్టు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పాడు.