న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన మార్కును చూపించడం ప్రారంభించారు. డే అండ్ నైట్ టెస్టులకు బీసీసీఐ శ్రీకారం చుట్టనుంది. తొలి డే మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించాలని ప్రతిపాదించింది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో మ్యాచ్ ను డే అండ్ నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని బీసీసీఐ బీసీబీకి ప్రతిపాదన పంపించింది. 

బిసీసీఐ ప్రతిపాదనకు బెంగాల్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆమోదం తెలియజేయాల్సి ఉంది. బీసీసీఐ ప్రతిపాదినపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ఆదివారంనాడు మీడియాకు తెలియజేశారు 

బీసీసీఐ నుంచి రెండు మూడు రోజుల క్రితం తమకు లేఖ వచ్చిందని, దానిపై తాము నిర్ణయం తీసుకుంటామని, అయితే ఆ విషయంపై తాము ఇంకా చర్చించలేదని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం తెలియజేస్తామని ఆయన చెప్పారు. 

కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించినందున తొలి డే అండ్ నైట్ మ్యాచ్ బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగానే జరుగుతుందని సౌరవ్ గంగూలీ చెప్పారు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 14వ తేదీన ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ నవంబర్ 22వ తేదీనుంచి ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది.

ఆటగాళ్లు, టీమ్ మేనేజ్ మెంట్ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే డే అండ్ నైట్ మ్యాచ్ పై నిర్ణయం తీసుకుంటామని బీసీబీ చీఫ్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. డే అండ్ నైట్ మ్యాచు అయితే గులాబీ బంతితో ఆడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.