Delhi Capitals Covid outbreak: కఠినాతి కఠిన ఆంక్షల మధ్య సాగుతున్న ఐపీఎల్ లో రెండు సార్లు కరోనా బారిన పడ్డ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మరే జట్టులో  ఆ ఆనవాలే లేకున్నా ఢిల్లీ కి మాత్రం  రెండు సార్లు ఆ దెబ్బ పడింది. ఈ విషయంపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది.

ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా తీవ్ర ఆంక్షల నడుమ బయో బబుల్ లో సాగుతున్న ఐపీఎల్-15లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో రెండు సార్లు కరోనా కలకలం రేపడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు కూడా ఢిల్లీ నెట్ బౌలర్ కు కరోనా పాజిటివ్ సోకడంతో జట్టంతా ఐసోలేషన్ కు వెళ్లింది. అయితే తొలిసారి ఢిల్లీ క్యాంప్ లో కరోనా సోకినప్పుడు పెద్దగా పట్టించుకోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంది. ఐపీఎల్ లో మరే జట్టులో కూడా కనీసం దగ్గు వచ్చిన కంప్లెయింట్లు లేకున్నా.. ఢిల్లీకి మాత్రం సెకండ్ వేవ్ తాకడంపై బీసీసీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్.. బీసీసీఐ నిర్దేశించిన నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నది. 

ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో తొలిసారి కరోనా కేసులు వచ్చినపుడు పెద్దగా పట్టించుకోని బీసీసీఐ.. ఇప్పుడు మాత్రం ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలేయదలుచుకోలేదు. పదే పదే కరోనా పాజిటివ్ కేసులు రావడం వల్ల ఐపీఎల్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందనే భావనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఉపేక్షించేది లేదని.. తప్పకుండా విచారించేది తీరాల్సిందేనని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం బీసీసీఐ ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలిపింది. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘అంతా అయోమయంగా ఉంది. ఇప్పటికైతే ఢిల్లీ క్యాంప్ లో కరోనా ఎలా వచ్చిందన్నది చెప్పడం కాస్త కష్టమే. అది ఫ్రాంచైజీ అధికారుల నుంచి క్యాంప్ లోకి చేరిందా...? లేక హోటల్ సిబ్బంది నుంచి వచ్చిందా..? అనేది తేలాల్సి ఉంది’ అని తెలిపాడు. ఢిల్లీ జట్టు ముంబై లోని ప్రముఖ తాజ్ హోటల్ లో బస చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే విషయమై సదరు అధికారి ఇంకా మాట్లాడుతూ.. ‘ఇంత కఠిన ఆంక్షలు ఉన్నా కరోనా ఢిల్లీ క్యాంప్ లోకి ఎలా ఎంటర్ అయిందనే విషయంపై మేము విచారణ చేపడతాం. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మాత్రం వారిపై కఠిన చర్యలుంటాయి. పదే పదే కేసులు రావడం వల్ల ఐపీఎల్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతున్నది. అయితే తొలుత ఎవరి వల్ల కరోనా వచ్చింది..? అనేది కనుక్కోవడం కష్టమే. ప్రస్తుతానికైతే మేము (బీసీసీఐ) దీనిమీద దృష్టిసారించాం..’ అని చెప్పాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా ఇలా : 

- పాట్రిక్ ఫర్హర్ట్ : ఫిజియోథెరఫిస్టు (ఏప్రిల్ 15న కరోనా సోకింది. ఐపీఎల్ లో తొలి కరోనా బాధితుడు ఫర్హర్టే..) 
- చేతన్ కుమార్ : స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్.. (ఏప్రిల్ 16న) 
- మిచెల్ మార్ష్ : ఢిల్లీ ఆల్ రౌండర్.. (ఏప్రిల్ 18న) 
- డాక్టర్ అభిజిత్ సాల్వి : టీమ్ డైరెక్టర్.. (ఏప్రిల్ 18న)
- ఆకాశ్ మనే : సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ (ఏప్రిల్ 18న)
- టిమ్ సీఫర్ట్ : ఢిల్లీ జట్టులో ఆటగాడు (ఏప్రిల్ 20 న) 
- రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరు (ఏప్రిల్ 22) 
- మే 8న ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ బౌలర్ కు కరోనా పాజిటివ్