Asianet News TeluguAsianet News Telugu

ఏం తమాషాలా..? వచ్చే ఏడాది నుంచి బ్యాన్ చేస్తాం..! బంగ్లా, శ్రీలంక బోర్డులపై బీసీసీఐ ఆగ్రహం

IPL 2023: బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులపై  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు   గుర్రుగా ఉంది.  క్రికెటర్ల విషయంలో  ఆ దేశ బోర్డులు  అనుసరిస్తున్న వైఖరిపై  బీసీసీఐ అసంతృప్తిగా ఉంది.

BCCI Unhappy With BCB and SL Boards,  Likely To ban on Sri Lanka and Bangladesh players in future MSV
Author
First Published Mar 26, 2023, 3:37 PM IST

ఐపీఎల్ - 16  ప్రారంభమవడానికి మరో  ఐదు రోజుల టైమ్ ఉంది.  ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో సన్నాహక శిబిరాలు ఏర్పాటుచేసి వారిని ఒక్కదగ్గరికి చేరుస్తున్నాయి.   అన్ని జట్లు  కొత్త సీజన్ ఆరంభం కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే  ఆడటానికి ఆస్కారముండీ  అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లపై  బీసీసీఐ   ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా  బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లు, బోర్డులు వ్యవహరిస్తున్న తీరుపై  బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారు.  

ఈ సీజన్ లో బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు క్రికెటర్లు, శ్రీలంక నుంచి నలుగురు.. వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్ ఆడనున్నారు. కానీ వాళ్లు  టోర్నీలోని పలు మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నారు.   తమ దేశం  ఇతర దేశాలతో  ఇదివరకే నిర్దేశించిన  సిరీస్ లలో భాగంగా పాల్గొంటున్నారు. బీసీసీఐకి ఇదే కోపం తెప్పిస్తోంది.  

మిస్ అయ్యే బంగ్లా ప్లేయర్లు.. 

బంగ్లాదేశ్ ప్లేయర్లు షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్ లతో పాటు ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు  ఐపీఎల్ లో  ఆడుతున్నారు.  ముస్తాఫిజుర్ ఢిల్లీకి ఆడుతుండగా  మిగతా ఇద్దరు  కోల్కతా నైట్ రైడర్స్  టీమ్ లో భాగంగా ఉన్నారు.  అయితే  ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు వీళ్లు దూరంగా ఉండనున్నారు.  స్వదేశంలో ఐర్లాండ్ తో  సిరీస్ లో భాగంగా   వీళ్లు  ఆడుతున్నారు.  ఏప్రిల్ 8 వరకూ ఈ సిరీస్ జరుగనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ కు వస్తారు.  మళ్లీ మే 7 నుంచి  14 వరకూ మరో సిరీస్ కోసం  ఐపీఎల్ కు దూరంగా ఉంటారు. కొన్ని రోజుల క్రితం వీళ్లు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) కోసం అప్లై చేసుకున్నా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అందుకు నిరాకరించింది. 

లంకదీ అదే కథ.. 

బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక కూడా  న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.   ఆ జట్టు కీలక ఆటగాళ్లు  వనిందు హసరంగ (ఆర్సీబీ), మతీశ పతిరన (సీఎస్కే),  మహీశ్ తీక్షణ (సీఎస్కే) లు కూడా ఏప్రిల్ 8 తర్వాతే ఐపీఎల్ కు వస్తారు.   కానీ భానుక రాజపక్స మాత్రం   ఐపీఎల్ మొదటి మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు. 

ముందే చెప్పాలిగా... 

కాగా బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్ల తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది.  ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టీమ్ లే వారి బోర్డులను ఒప్పించుకుని  ఇండియాకు వస్తున్నప్పుడు పొరుగున ఉన్న బంగ్లా, లంకలు రాకపోవడంపై బోర్డు పెద్దలు  అసంతృప్తితో ఉన్నారని సమాచారం.  తమ బోర్డులను ఒప్పించుకోనప్పుడు  వేలంలో పేర్లు ఇవ్వడం దేనికని..? బోర్డు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాబోయే వేలం నుంచి బంగ్లాదేశ్, లంక ప్లేయర్లపై  నిషేధం విధించే దిశగా బీసీసీఐ  భావిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ తలుచుకుంటే పెద్ద పెద్ద బోర్డులే ఐపీఎల్ కోసం తమ షెడ్యూల్ ను మార్చుకుంటున్న వేళ  బీసీబీ, లంకలు  ఈ విధంగా వ్యవహరించడం వాటికి నష్టం కలిగించేదేనని  ఐపీఎల్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios