Asianet News TeluguAsianet News Telugu

BCCI: ఆటగాళ్లకు రూ. 4 కోట్లు.. ఆర్భాటలకు రూ. 14 కోట్లు.. బీసీసీఐ తీరుపై విమర్శలు

BCCI Olympics Bill: టోక్యో ఒలింపిక్స్ లో విజేతలను సన్మానించడానికి తాము రూ. 18 కోట్లను వెచ్చించామని బీసీసీఐ తాజాగా లెక్కలు చూపినట్టు తెలుస్తున్నది. అయితే ఇందులో వాస్తవంగా ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే.. 

BCCI Spent Rs. 18 Crores For Tokyo Olympic Winners award Function, But Gave rs. 4 Crores Only
Author
India, First Published Jul 23, 2022, 4:31 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది.  ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న మన పెద్దలు.. భారత్ లో ఇతర క్రీడాకారులకు ‘ప్రోత్సాహం’ అందించడం  కోసం వెచ్చించిన మొత్తంలో తేడాలున్నట్టు తెలుస్తున్నది. గతేడాది టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతల కోసం ఖర్చు చేసిన మొత్తం, అంతకుముందు ఇస్తానన్న లెక్కలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే  ఆటగాళ్ల ప్రోత్సాహమేమో గానీ బీసీసీఐ ఆర్భాటమే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నదని వాదనలు వినిపిస్తున్నాయి.  

అసలు విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్ లో విజేతలను సన్మానించడానికి (వారికి నగదు బహుమతులతో సహా) తాము రూ. 18 కోట్లను వెచ్చించినట్టు బీసీసీఐ తాజాగా లెక్కలు చూపినట్టు తెలుస్తున్నది. ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన నీరజ్ చోప్రాతో పాటు లవ్లీనా బోర్గోహెయిన్, పివి సింధు వంటి ఆటగాళ్లకు బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఒలింపిక్ విజేతల నగదు బహుమానాలకు బీసీసీఐ వెచ్చించిన మొత్తం రూ. 4 కోట్లు. కానీ బీసీసీఐ మాత్రం దీనిని రూ. 18 కోట్లుగా చూపించింది.

ముంబైలో ఇటీవలే ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ లో వచ్చిన ఓ కథనం ఆధారంగా తెలుస్తున్నది. అయితే ఆటగాళ్లకు అందిన ప్రోత్సాహం కంటే బీసీసీఐ చేసిన ఆర్బాటాలే ఎక్కువున్నట్టు పైన లెక్కలు చూస్తే అర్థమవక మానదు.  ఆర్బాటాలలో భాగంగా  ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు గాను ప్రముఖ గాయకుడు  మోహిత్  చౌహాన్ కు రూ. 70 లక్షలను ఖర్చు చేసిన  బోర్డు.. ఒలింపిక్స్ మార్కెటింగ్ క్యాంప్ నకు రూ. 90 లక్షలు వెచ్చించిందట. ఇవేగాక టోక్యో ఒలింపిక్స్ ప్రమోషన్స్ కోసం ఓ కమర్షియల్ కంపెనీకి రూ. 7 కోట్లు  కట్టబెట్టిన బీసీసీఐ.. పీఎం కేర్స్ మెమొంటోల కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపెట్టినట్టు సమాచారం. 

వాస్తవానికైతే బీసీసీఐ.. భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ పతక విజేతలకు ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే. మరి  ఈ లెక్కల్లో బొక్కల గురించి బీసీసీఐ బాసులు, ట్రెజరీలే సమాధానం చెప్పాలంటున్నారు క్రీడాభిమానులు. సాయం చేయాల్సి వస్తే ఆటగాళ్లకు నేరుగా సాయం చేయాలిగానీ ఈ హంగులు, ఆర్భాటాలు ఎందుకని నిలదీస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios