భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న భారత క్రికెట్‌ను, ఆ చీకటి ముసుగులో నుంచి బయటికి తీసుకొచ్చి టాప్ టీమ్‌గా మలిచాడు గంగూలీ.

గంగూలీ మాట్లాడాలంటేనే మ్యాచ్ ఫిక్సర్లు భయపడిపోయేవారంటే... టీమ్‌లో ‘దాదా’గిరి ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కొన్నిరోజుల క్రితం గుండెపోటుకి గురైన సౌరవ్ గంగూలీ... బెడ్ మీది నుంచి మీటింగ్‌కి హాజరై, డెడికేషన్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు.

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ, యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశార్జీ అయిన సంగతి తెలిసిందే. గురువారం ఆసుపత్రి నుంచి డిశార్చి అయినా... మంగళవారం ఆసుపత్రి బెడ్ మీది నుంచే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నాడట ‘బెంగాల్ టైగర్’.

అంతకుముందే సర్జరీ జరిగి నీరసంగా ఉన్నా, ఐపీఎల్ 2021 గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండడంతో మీటింగ్‌కి హాజరయ్యాడట గంగూలీ. ఈ విషయం తెలిసిన వారందరూ దాదా డెడికేషన్‌కి హ్యాండ్సాఫ్ చెబుతున్నారు.