IND vs SA T20I Series: రెండున్నరేండ్లుగా  ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన  కరోనా నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు  ఇప్పుడిప్పుడే ఆయా ప్రభుత్వాలు  చర్యలు తీసుకుంటున్నాయి. క్రికెటర్లకు కూడా బుడగ నీడ వీడనుంది. 

మాయదారి మహమ్మారి కరోనా ప్రారంభమయ్యాక క్రికెట్ లో కొత్తగా వచ్చిన బయో బబుల్ విధానానికి స్వస్తి పలికేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయా క్రికెట్ బోర్డులు సమాయాత్తమవుతున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా కీలక ముందడుగేసింది. త్వరలో భారత జట్టు పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ నుంచి బుడగకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నది. ఈ సిరీస్ ను బయో బబుల్ లేకుండానే ఆడించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక బయో బబుల్ కు స్వస్తి పలకడమే ఉత్తమమని బీసీసీఐలో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. బయో బబుల్ వల్ల క్రికెటర్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, దీని ప్రభావం వారి ఆట మీద కూడా పడుతుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా బబుల్ జీవితానికి గుడ్ బై చెప్పాలని, ఆటగాళ్లకు కరోనా ముందటి సాధారణ పరిస్థితులు కల్పించాలని అన్ని జాతీయ క్రికెట్ బోర్డులను సూచించింది. ఇప్పటికే ఇంగ్లాండ్ లో బబుల్ లేకుండానే సిరీస్ లు జరుగుతున్నాయి. కానీ మిగతా దేశాల్లో (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా) మాత్రం ఇప్పటికీ బబుల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. 

Scroll to load tweet…

అయితే ఇటీవలే పాకిస్తాన్ కూడా ఐసీసీ సూచనలకు ఆమోదం తెలిపింది. పాక్ తర్వాత ఆడబోయే సిరీస్ లను బబుల్ లేకుండానే ఆడతామని తెలిపింది. బీసీసీఐ కూడా ఇటీవలే దేశవాళీ క్రికెటర్లకు ఈ కఠినమైన జీవితాల నుంచి కాస్త తెరిపినివ్వాలని భావించింది. ఇక ఇప్పుడు దీనిని జాతీయ జట్టుకు కూడా అమలు చేయాలని చూస్తున్నది. అయితే బబుల్ లేకున్నా కఠినమైన క్వారంటైన్ నిబంధనలను మాత్రం తప్పకుండా అమలు చేయనున్నారు. రెగ్యులర్ టెస్టులు, ఇతర కరోనా మార్గదర్శకాలను మాత్రం ఆటగాళ్లు తూచా తప్పకుండా పాటించాలి. 

సౌతాఫ్రికా సిరీస్ ను బుడగ రహితంగా నిర్వహించి తద్వారా ఐర్లాండ్, ఇంగ్లాండ్ లకు కూడా ఇదే విధానాన్ని అమలుచేయాలని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఐపీఎల్ మే 29 వరకు ముగియనుంది. ఇది ముగిసిన వెంటనే జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికా తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతుంది. 

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ : 

- తొలి టీ20 : జూన్ 9 : ఢిల్లీ 
- రెండో టీ20 : జూన్ 12 : కటక్
- మూడో టీ20 : జూన్ 14 : వైజాగ్ 
- నాలుగో టీ20 : జూన్ 17 : రాజ్కోట్ 
- ఐదో టీ20 : జూన్ 19 : బెంగళూరు