IPL 2022: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్ జరుగుతుందా..? లేదా..? అని క్రికెట్ అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

దేశంలో కొద్దిరోజుల క్రితం వరకు స్తబ్దుగా ఉన్న కరోనా మళ్లీ జూలు విదిల్చింది. కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో భారత్ లో కేసులు మళ్లీ రాకెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి మళ్లీ ఐపీఎల్ నిర్వహణ కష్టాలు ఎదురయ్యాయి.ఈ ఏడాది ఇండియాలోనే ఐపీఎల్ ను నిర్వహించి తీరుతామని బీసీసీఐ నిర్ణయించుకుంది. గత రెండేండ్లలో.. 2020 లో ఐపీఎల్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వగా 2021 లో సగం ఇక్కడ మిగతా సగం దుబాయ్ లో నిర్వహించారు. కానీ కొద్దిరోజుల క్రితం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ఐపీఎల్ ను ఈసారి కచ్చితంగా ఇండియాలోనే నిర్వహిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. 

2022 ఐపీఎల్ సీజన్ ను ఘనంగా ఆరంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి కొత్తగా రెండు ఫ్రాంచైజీలు కూడా చేరాయి. వచ్చే నెలలో ఐపీఎల్ వేలం కూడా నిర్వహించాలని చూసింది. కానీ దేశంలో కరోనా పెరుగుదలతో మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి. దీంతో ఈసారి కూడా ఐపీఎల్ ను విదేశాలలో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం వీటిని కొట్టిపారేసింది. 

కరోనా నేపథ్యంలో దేశంలోని ఇతర నగరాల్లో కాకుండా సీజన్ మొత్తం జరిగే మ్యాచులను ఒకే రాష్ట్రంలో నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర ను ఎంచుకుంది. ఆశ్చర్యకరంగా దేశంలో నమోదయ్యే మొత్తం కరోనా కేసుల్లో అగ్రభాగం ఈ రాష్ట్రంలో నమోదయ్యేవే కావడం గమనార్హం. 

అయితే బీసీసీఐ వీటినేమీ పట్టించుకోవడం లేదు. ముంబైలోని నాలుగు స్టేడయాలలో ఐపీఎల్-2022 ను నిర్వహించాలని చూస్తున్నది. ముంబై లో ఉన్న వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (గహుంజే) లలో ఐపీఎల్ ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం. 

 ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక సీఈవో, ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంగ్ అమిన్.. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ పాటిల్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. అంతేగాక కొద్దిరోజుల క్రితం వీళ్లిద్దరూ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ను కలిసి ఇదే విషయమ్మీద చర్చించినట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో ఐపీఎల్ నిర్వహణ నిమిత్తం వీళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేను కలిసే అవకాశముంది.