4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచులు... జియోకి పర్మిషన్ ఇచ్చిన బీసీసీఐ! ఇక జిగిల్‌మనే రంగులే...
4K రిజల్యూషన్ టెక్నాలజీలో ఐపీఎల్ 2023... జియో రిక్వెస్ట్‌ని ఆమోదించిన బీసీసీఐ! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో సంచలన మార్పులకు శ్రీకారం..

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అప్పుడెప్పుడో 10-15 ఏళ్ల క్రితం రిలీజైన సినిమాల ప్రింట్‌లకు బూజు దులిపి, 4K రిజల్యూషన్‌లో రీరిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు ‘ఒక్కడు’, ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ‘ఖుషి’, ఎన్టీఆర్ ‘బాద్‌షా’, నందమూరి బాలయ్యబాబు నటించిన ‘చెన్నకేశవరెడ్డి’, ‘సమరసింహా రెడ్డి’ సినిమాలు ఇలా రీరిలీజ్ అయ్యి, ఫ్యాన్స్‌ని ఫుల్లు ఖుషీ చేశాయి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా 4K రిజల్యూషన్ టెక్నాలజీలో ప్రసారం చేయబోతోంది జియో నెట్‌వర్క్...
ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్‌ని రూ.23,773 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన వయాకామ్18. భారత్‌తో పాటు మిగిలిన దేశాల్లో మొబైల్ ప్రసారాలన్నీ వయాకామ్18 చేతుల్లోనే ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ ప్రసారాలు చేసిన జియో సినిమాలోనే ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలను చేయబోతోంది వయాకామ్18...
ఇంతవరకూ ఐపీఎల్‌ను ప్రసారం చేసిన హాట్ స్టార్, సబ్‌స్క్రిప్షన్ రూపంలో వినియోగదారుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసింది. ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారిలో చాలామంది ఐపీఎల్ చూడడానికే అంటే అతిశయోక్తి కూడా కాదు...
ఇప్పటికే లైవ్ మ్యాచ్‌ని వివిధ కెమెరా యాంగిల్స్‌లో చూసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది జియో. ఉదాహరణ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఛానెల్ వాడు ఏ కెమెరా యాంగిల్‌లో మ్యాచ్‌ని చూపిస్తే, అదే చూడాలి. అయితే జియో వినియోగదారులు, స్టంప్ కెమెరా దగ్గర్నుంచి మ్యాచ్ చూస్తే, ప్లేయర్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలనుకున్నా వినేయొచ్చు. ఈ విధంగా ఐదారు యాంగిల్స్, ఏరియాల్లో బిగించిన కెమెరాల్లో నచ్చిన దాన్ని ఎంచుకుని మ్యాచ్‌ని వీక్షించవచ్చు..
అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో అత్యాధునిక టెక్నాలజీని తీసుకురాబోతోంది జియో. లైవ్ మ్యాచ్‌ని 4K Resoulationలో ప్రసారం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేసుకుంది. ఇప్పటికే బీసీసీఐ నుంచి 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ ప్రసారాలకు అనుమతులు పొందిన జియో... దీని కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేయనుంది...
మొబైల్ టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన జియో నెట్‌వర్క్, ఐపీఎల్ 2023 టోర్నీలో ఓటీటీ రంగంలోనూ పెను మార్పులు తీసుకొచ్చేలా కనబడుతోంది. 4K రిజల్యూషన్‌లో, నచ్చిన యాంగిల్‌లో మ్యాచ్ చూసేందుకు, అది కూడా ఉచితంగా అంటే... జియో దెబ్బ, మిగిలిన ఓటీటీలపై ఏ రేంజ్‌లో పడుతుందోనని మార్కెటింగ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు..