బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఇప్పుడు ఆయన కుమార్తె రూపా గురునాథ్‌కి నోటీసులు జారీ కావడంలో షాక్ అయ్యారు.

తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన రూపా గురునాథ్, ఇండియా సిమెంట్స్‌లో డైరెక్టర్ పదవితో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి యజమానిగా కూడా వ్యవహారిస్తున్నారు.బీసీసీఐ రూల్స్ ప్రకారం ఒక పదవిలో ఉన్న వ్యక్తి, అందులో నుంచి తప్పుకునేవరకూ మరో పదవిని, హోదాని అనుభవించడానికి వీలు ఉండదు.

ఇలా చేస్తే అది ద్వంద ప్రయోజనం లేదా, పరస్ఫర విరుద్ధ ప్రయోజనం కింద వస్తుంది. ఈ కారణంగానే రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి మాజీ క్రికెటర్లు కొన్ని పదవులను వదలుకున్నారు. 

రూపా గురునాథ్‌పై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం లైఫ్ టైమ్ మెంబర్ సంజీవ్ గుప్తా ఈ ఫిర్యాదు చేశారు. గుప్తా ఫిర్యాదును స్వీకరించిన ఎథిక్స్ అధికారి, మాజీ న్యాయమూర్తి డీకే జైన్ నోటీసులు జారీ చేశారు.