Asianet News TeluguAsianet News Telugu

బిసీసీఐ చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఖేల్ ఖతమ్: హిట్లూ ఫట్లూ

ఎన్నికల్లో పోటీచేసి ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం ఎక్కిన గంగూలీ (2019 అక్టోబర్‌) పది నెలలు పూర్తి చేసుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)తో కలుపుకుని భారత క్రికెట్‌ పరిపాలనలో ఆరేండ్లు పూర్తి చేసుకుని, మూడేండ్ల కచ్చితమైన విరామ సమయానికి చేరుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)తో కలుపుకుని భారత క్రికెట్‌లో వరుసగా ఆరేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. 

bcci chief sourav ganguly's term ends: his hit and flop shows
Author
Mumbai, First Published Jul 30, 2020, 6:07 PM IST

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ లోగా జులై 27తో సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు గంగూలీ పదవిలో కొనసాగుతాడా? తప్పుకుంటాడా? అనేది చర్చగానే మిగిలింది. 

ఎన్నికల్లో పోటీచేసి ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం ఎక్కిన గంగూలీ (2019 అక్టోబర్‌) పది నెలలు పూర్తి చేసుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)తో కలుపుకుని భారత క్రికెట్‌ పరిపాలనలో ఆరేండ్లు పూర్తి చేసుకుని, మూడేండ్ల కచ్చితమైన విరామ సమయానికి చేరుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)తో కలుపుకుని భారత క్రికెట్‌లో వరుసగా ఆరేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు. 

అధికారికంగా సౌరభ్‌ గంగూలీ, జై షాలు బీసీసీఐ పదవుల్లో ఉన్నా లేనట్టే!. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరభ్‌ గంగూలీ ప్రతి అంశంపైనా స్పందించాడు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. గంగూలీ పది నెలల పదవీ కాలంలో మూడు నెలలు కరోనా వైరస్‌ మహమ్మారితో అభివృద్దికి ఆటంకం కలిగించినా.. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ ఏం చేస్తానని చెప్పాడు, ఏం చేశాడు? అనే వివరాలను చూద్దాం.

దేశవాళీ క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు : 

గంగూలీ ఏం చెప్పాడు? : 

'అధ్యక్షుడిగా చేయబోయే ప్రథమ పని. రంజీ సీజన్‌ ఆరంభానికి ముందే దేశవాళీ క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు అందిస్తాం. భవిష్యత్‌ కోహ్లిలు, ధోనీలు, రహానెలు, రోహిత్‌లు అక్కడే తయారవుతారు. ఈ కాంట్రాక్టు విధానం ఉత్తమంగా ఉండాలి. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదంతో ఈ పని చేస్తాను. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని పాలకుల కమిటీకి మూడేండ్లుగా విజ్ఞప్తి చేశాను. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్ల ఆర్థిక బాగోగులు చూడటం బోర్డు ప్రథమ కర్తవ్యం. దేశవాళీ క్రికెటర్లకు కాంట్రాక్టులు రూపొందించమని ఆఫీస్‌ బేరర్లం ఆర్థిక కమిటీకి చెబుతాం'. 

ఏం జరిగింది : ఇప్పటివరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్లకు ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వలేదు. పంజాబ్‌, ఉత్తరాఖాండ్‌ రాష్ట్ర సంఘాలు కాంట్రాక్టులకు ఆమోదం తెలిపినా, అమల్లోకి రావాల్సి ఉంది. దేశవాళీ క్రికెటర్ల ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌పై భరోసా కల్పించే కాంట్రాక్టులు పక్కనపెడితే.. కరోనా కష్టకాలంలో రావాల్సిన మ్యాచ్‌ ఫీజులు సైతం బీసీసీఐ నుంచి విడుదల ఆలస్యమైంది. కోవిడ్‌-19ను బోర్డు కారణంగా చూపినా, దేశవాళీ క్రికెటర్లు కష్టాలు పడిన మాట వాస్తవం.

భారత క్రికెట్‌ బోర్డు పని విధానం : 

గంగూలీ ఏం చెప్పాడు?

'బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుంది. గత మూడేండ్లుగా అత్యయిక పరిస్థితి మాదిరిగా ఉన్నది. ఇక నుంచి ఆ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఓ జట్టుగా పరిపాలనను ఓ క్రమపద్దతిలో పెట్టేందుకు మేము ఎన్నో పనులు చేయాలి. బీసీసీఐ యంత్రాంగం, కార్యాలయం, క్రికెట్‌ ఇలా ఎన్నో విషయాలను పద్దతిగా నడిపించాల్సిన గురుతర బాధ్యత ఉంది'. 

ఏం జరిగింది : అధికారికంగా గంగూలీ పదవీకాలం పూర్తయ్యేసరికి బీసీసీఐ తొలి సీఈఓ రాహుల్‌ జోహ్రీ, తొలి సీఎఫ్‌ఓ సంతోష్‌లు రాజీనామా చేశారు. సీఓఓ సైతం పదవీ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ సబా కరీం సైతం వైదొలిగాడు. ఎన్నికైన ఐదు నెలలకే రాజీనామా చేయటంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంది. అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం పూర్తి చేసుకున్న కార్యదర్శి అధికారికంగా కొనసాగుతూనే ఉన్నాడు. బీసీసీఐ పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు తయారైంది.

బధిరుల క్రికెట్‌ అభివృద్ధి : 

గంగూలీ ఏం చెప్పాడు? : 

'బధిరుల క్రికెట్‌ను నడిపించేందుకు ప్రయత్నిస్తాం. నూతన రాజ్యాంగంలో ఇది ఓ భాగం. గత కొన్నేండ్లుగా మహిళల క్రికెట్‌ను పర్యవేక్షిస్తున్నట్టే.. బధిరుల క్రికెట్‌ను రానున్న రోజుల్లో చూసుకుంటాం. క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌తో మాట్లాడి బధిరుల క్రికెట్‌ అభివృద్ధికి ఏం చేయగలమో తెలుసుకుని, చేస్తాను'. 

ఏం జరిగింది : బధిరుల క్రికెట్‌ను నడిపిస్తున్న వివిధ క్రికెట్‌ సంఘాలను గంగూలీ పిలిపించాడు. జయేశ్‌ రంజన్‌ ఆధ్వర్యంలో బధిరుల క్రికెట్‌ కమిటీ ఏర్పాటు కానుందని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత బీసీసీఐ నుంచి ఎటువంటి కదలిక లేదు. పలు బధిరుల క్రికెట్‌ సంఘాలు బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లకు లేఖలు రాసినా, సమాధానం రాలేదు. బీసీసీఐ నుంచి నిధులు సైతం బధిరుల క్రికెట్‌ సంఘాలకు దక్కలేదు.

మెన్స్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నియామకం : 

గంగూలీ ఏం చెప్పాడు? :

'పదవీ కాలం ముగిసింది అంటే, దానర్థం అక్కడితో కథ ముగిసింది. పదవీ కాలం అనంతరం సైతం కొనసాగేందుకు వీల్లేదు. సెలక్షన్‌ ప్యానల్‌లో పదవీ కాలం పూర్తి చేసుకోని వారు కొనసాగుతారు. ఇదో పెద్ద సమస్య అని నేను అనుకోవటం లేదు'. 

ఏం జరిగింది : ఆ మాట చెప్పిన మూడు నెలల తర్వాత సెలక్షన్‌ కమిటీ నూతన సభ్యుల నియామకం జరిగింది. ఆ ఫలితంగా, పదవీ కాలం ముగిసినా ఎమ్మెస్కే ప్రసాద్‌, గగన్‌ ఖోడాలు న్యూజిలాండ్‌ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేశారు. మెన్స్‌ సీనియిర్‌ సెలక్షన్‌ కమిటీ నియామకాన్ని క్రికెట్‌ సలహా సంఘం (సీఏసీ) చూస్తుంది. విరుద్ధ ప్రయోజనాల వివాదంతో సీఏసీ నియామకంలో జాప్యం. చోటుచేసుకుంది. సీఏసీని పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు చెప్పగా..వాస్తవానికి రెండు నెలలు పట్టింది.

భారత క్రికెటర్ల సంఘానికి నిధులు : 

గంగూలీ ఏం చెప్పాడు? :

'అవును, భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)తో కలిసి పని చేయనున్నాం. ఐసీఏకు అవసరమైన నిధులు, ఇతరాత్ర ఏమైనా మేము చూసుకుంటాం'. 

ఏం జరిగింది : భారత క్రికెటర్ల సంఘానికి బీసీసీఐ రూ.2 కోట్లు నిధులు విడుదల చేసింది. ఆరంభ కార్యనిర్వహణకు రూ.10 కోట్లు నిధులు ఇవ్వాలని ఐసీఏ కోరింది. సొంతంగా నిలబడేవరకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని నివేదించింది. బీసీసీఐ నుంచి పెద్దగా స్పందన లేదు.

మహిళల సెలక్షన్‌ కమిటీ : 

గంగూలీ ఏం చెప్పాడు? :

'సెలక్షన్‌ కమిటీలో ఐదుగురు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. మహిళల సెలక్షన్‌ కమిటీని సీఏసీ నియమించదు. సీఏసీ కేవలం మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ, చీఫ్‌ కోచ్‌నే ఎందుకు నియమిస్తుందో తెలియదు. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు మహిళల సెలక్షన్‌ కమిటీని నియమిస్తుంది'. 

ఏం జరిగింది : మహిళల సెలక్షన్‌ కమిటీలో ఎటువంటి పురోగతి లేదు. ఐదుగురు సెలక్టర్లు పదవీకాలం పూర్తి చేసుకున్నా, ఇంకా ఎవరినీ నియమించలేదు. సీఏసీ అవసరం లేదు కాబట్టి, ఆఫీస్‌ బేరర్లే ఈ పని చేయవచ్చు. సెలక్షన్‌ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ నెలలు గడుస్తున్నా ఎటువంటి ముందడుగు లేదు. దరఖాస్తు చేసుకున్న మాజీ మహిళా క్రికెటర్లు బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు.

వీటితోపాటుగా.... బీసీసీఐ నూతన రాజ్యాంగంలో సవరణలకు ఉద్దేశించిన పిటిషనును సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం సైతం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. బోర్డు కార్యదర్శికి తిరిగి పూర్తి అధికారాలు దఖలు పడేందుకు వీలుగా మరో పిటిషను సైతం సుప్రీంకోర్టులో వేశారు. ఇవన్నీ విచారణకు రావాల్సి ఉంది. 

ఇక క్రికెట్‌ పరంగా గంగూలీ చొరవతో భారత్‌ తొలి డే నైట్‌ టెస్టు ఆడింది. ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టు మ్యాచ్‌ విజయవంతమైంది. కరోనా కష్టకాలంలోనైనా ఐపీఎల్‌ లేకుండా 2020 ముగియదని గంగూలీ అన్నాడు, అందుకు తగినట్టే యుఏఈలో ఐపీఎల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా సహా మరో అగ్రజట్టుతో నాలుగు దేశాల సూపర్‌ సిరీస్‌ (ప్రతి ఏడాది)ను గంగూలీ ప్రతిపాదించారు. అగ్ర జట్లు పోటీపడే ఈ టోర్నీ వరల్డ్‌ క్రికెట్‌లో ఓ సంచలనం అవుతుందనే అంచనాలు నెలకొన్నా.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలు దాదా ఆలోచనతో ఏకీభవించినట్టు లేదు!. 

కేవలం పది నెలల పదవీ కాలంలో ఏ వ్యక్తి నుంచి అద్భుతాలు ఆశించలేం. గంగూలీ అందుకు మినహాయింపు కాదు. కానీ పది నెలల కాలంలో స్పష్టమైన మార్పు చూపించగల పనితీరు కనబర్చటంలో దాదా విఫలమయ్యారనే చెప్పవచ్చు. 

గంగూలీ సారథ్యంలోని బీసీసీఐ నూతన పాలక మండలి రాజకీయంగా ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ పరపతిని తిరిగి సాధించటంలో సక్సెస్‌ సాధించింది. కానీ బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, దేశవాళీ క్రికెట్‌లో చెప్పుకోదగిన మార్పులు లేవు. 

పూర్తి కాలం పదవిలో కొనసాగితే గంగూలీ తన మార్క్‌ను చూపగలడేమో, కానీ పది నెలల కాలపరిమితే అని తెలిసీ ఎన్నికల బరిలో నిలిచిన దాదా ఇప్పుడు బోర్డు నాయకత్వ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టడం ఎంతవరకు సబబు?!.

Follow Us:
Download App:
  • android
  • ios