WPL 2023 Schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ఇటీవలే వేలం ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ తొలి సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ లో రెండ్రోజుల క్రితమే వేలం ప్రక్రియను విజయవంతంగా ముగించిన బీసీసీఐ.. తాజాగా ఇందుకు సంబంధించిన తొలి సీజన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ సీజన్ లో తొలి మ్యాచ్ జరుగనుంది. అందరూ ఊహించినట్టుగానే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్యే జరుగనున్నది.
డబ్ల్యూపీఎల్ లో భాగంగా తొలి సీజన్ మార్చి 4 నుంచి 26 దాకా కొనసాగనుంది. ఈ సీజన్ లో ఐదు జట్లూ ఒక్కో టీమ్ తో రెండేసి మ్యాచ్ లు ఆడతాయి. మొత్తంగా లీగ్ దశలో 20, రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు ఉన్నాయి. 22 రోజుల పాటు సాగే ఈ సీజన్ లో మ్యాచ్ లు ముంబైలోని బ్రబోర్న్, డాక్టర్ డీవై పాటిల్ స్టేడియాల్లో జరుగుతాయి.
షెడ్యూల్ ఇదే..
- మార్చి 4 (శనివారం)న మొదలయ్యే సీజన్ మ్యాచ్ ముంబై - గుజరాత్ మధ్య జరుగనుంది. ఆ తర్వాతి రోజు ఆర్సీబీ - ఢిల్లీ, యూపీ-గుజరాత్ లు తలపడతాయి.
- ఈ సీజన్ లో భాగంగా నాలుగు డబుల్ హెడర్లు ఉన్నాయి. డబుల్ హెడర్లు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. మిగతా రోజుల్లో మ్యాచ్ లు రాత్రి 7.30 గంటలకే స్టార్ట్ అవుతాయి.
- ప్రతీ జట్టూ ప్రత్యర్థి జట్టుతో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది.
- బ్రబోర్న్ లో 11, డీవై పాటిల్ లో 11 మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ లో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాలలో ఉన్న టీమ్ లు మార్చి 24న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఆ మ్యాచ్ లో గెలిచిన విజేతతో మార్చి 26న ఫైనల్ జరుగుతుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టీమ్స్ :
1. ముంబై
2. గుజరాత్ జెయింట్స్
3. బెంగళూరు
4. ఢిల్లీ
5. లక్నో (యూపీ వారియర్స్)
