Chetan Sharma: ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ భారత క్రికెట్ ను అగాథంలో పడేశాడు. ఓ టీవీ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో భారత క్రికెట్ ను బజార్లో నిలబెట్టాడు.
భారత క్రికెట్ మీద కలలో కూడా ఎవరూ ఊహించని పిడుగు పడింది. అటు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు విజయం.. అండర్ -19 అమ్మాయిలకు ప్రపంచకప్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంతో సంబురాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాకులిస్తూ సంచలన వీడియో బయటకొచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ - విరాట్ కోహ్లీ వివాదం, రోహిత్ - కోహ్లీల మధ్య ఈగో, టీ20కి కొత్త కెప్టెన్, ఆటగాళ్ల ఫిట్నెస్.. తదితర విషయాలపై బీసీసీఐ ఇన్నాళ్లు దాచిన విషయాలన్నీ బట్టబయలయ్యాయి. ఇది చేసింది బయిటివాళ్లెవరో అనుకుంటే పొరపాటే. సాక్షాత్తూ భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మనే..
ప్రముఖ హిందీ న్యూస్ ఛానెల్ ‘జీ న్యూస్’ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ స్పై కెమెరాకు బీసీసీఐ రహస్యాలను అరటిపండు తొక్క తీసినంత ఈజీగా బట్టబయలు చేశాడు. తాజా ఉదంతంతో ప్రపంచ క్రికెట్ పెద్దన్నగా వ్యవహరిస్తున్న బీసీసీఐతో పాటు భారత క్రికెట్ పరువును నడిబజార్లోకి ఈడ్చుకొచ్చాడు చేతన్.. స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా చేతన్ చెప్పిన సంచలనా విషయాలు అతడి మాట్లల్లోనే....
కోహ్లీ - గంగూలీ వివాదంపై..
‘‘కోహ్లీ - గంగూలీ మధ్య విభేదాలు ఉండేవి. విరాట్ తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని ఫీలయ్యేవాడు. కుంబ్లే కోచ్ గా తప్పుకున్నాక తిరిగి రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా ఎంపిక కావడంలో అతడిదే కీలక పాత్ర. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి తాను వైదొలుగుతున్నానని చెప్పినప్పుడు మరోసారి ఆలోచించుకోవాలని దాదా చెప్పాడు. సమావేశంలో మేము 9 మంది ఉన్నాం. మరి గంగూలీ మాటలు కోహ్లీ విన్నాడో లేదో తెలియదు గానీ దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లేముందు ఈ వివాదంలో విలేకరులతో మాట్లాడుతూ కోహ్లీ అబద్దం చెప్పాడు. వాస్తవానికి కోహ్లీని కెప్టెన్ గా తప్పించాలనేది (వన్డేలకు) గంగూలీ నిర్ణయం కాదు. అది ఉమ్మడిగా తీసుకున్నదే. పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఒకడే సారథి ఉండాలని మేం కోహ్లీకి చెప్పాం. తనపై వేటు పడటానికి గంగూలీయే కారణమని కోహ్లీ భావించాడు.
రోహిత్ - కోహ్లీ ఈగో..
టీమిండియాలో రెండు వర్గాలున్నాయి. అది అందరికీ తెలిసిందే. ఒక వర్గాన్ని రోహిత్ నడిపిస్తే మరో వర్గాన్ని కోహ్లీ నడిపిస్తాడు. అయితే ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరి మధ్య అహం సమస్య ఉన్నా అది అమితాబ్ - ధర్మేంద్ర మధ్య ఉన్నటువంటిదే.. కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు రోహిత్ అతడికి అండగా నిలిచాడు.
ఆటగాళ్ల ఫిట్నెస్..
భారత క్రికెటర్లు ఫిట్నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారు. వాళ్లు 80 శాతం ఫిట్ గా ఉన్నా ఇంజెక్షన్లు వేసుకుని వంద శాతం ఫిట్నెస్ సాధిస్తారు. అయితే అవి డోప్ టెస్టులలో దొరికే మందులు కావు. వైద్యలు సూచనతో డోప్ టెస్టులలో పట్టుబడని డ్రగ్స్ వాడతారు. సరిగా ఆడలేని పలువురు క్రికెటర్లు కూడా వీటిని తీసుకుని మ్యాచ్ లు ఆడతారు. బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించకముందు ఆస్ట్రేలియాతో (గతేడాది అక్టోబర్ లో) ఆడాడు. అతడు ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్ తో లేడు.
హార్ధిక్ నన్ను గుడ్డిగా నమ్ముతాడు.. అతడే ఫ్యూచర్ కెప్టెన్..
టీమిండియాకు టీ20లలో ఫ్యూచర్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యానే. రోహిత్, హార్ధిక్ నన్ను గుడ్డిగా నమ్ముతారు. వాళ్లు మా ఇంటికి తరుచూ వస్తారు. హార్ధిక్ నిత్యం నాతో టచ్ లో ఉంటాడు. భవిష్యత్ లో రోహిత్ టీమిండియా టీ20 ప్రణాళికల్లో ఉండడు. గిల్, ఇషాన్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికే పొట్టి ఫార్మాట్ లో రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టాం.
నా హయాంలో వచ్చినోళ్లే వాళ్లంతా..
టీమిండియాలో ప్రస్తుతం ఆడుతున్న యువ ఆటగాళ్లంతా నేను తీసుకొచ్చినవారే. శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ వంటి ఆటగాళ్లను నేనే జట్టులోకి తీసుకొచ్చా. ఇషాన్, గిల్ ల వల్లే సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ల కెరీర్ ప్రమాదంలో పడింద’’ని చేతన్ శర్మ మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
షాక్ లో బీసీసీఐ..
చేతన్ వ్యవహారంపై బీసీసీఐ షాక్ లో పడింది. భారత క్రికెట్ పరువుకు సంబంధించిన అంశం కావడంతో ఇంతవరకూ దీనిపై బోర్డు నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. కానీ చేతన్ కు మాత్రం షాకు తప్పేలా లేదు. అతడిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటారా..? లేక కొన్నాళ్లాగాక రంగంలోకి దిగుతారో తెలియదు గానీ చేతన్ పై వేటు మాత్రం పక్కా అనే బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది.
