Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. అధికారిక ప్రకటన విడుదల

BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  కు కొత్త అధ్యక్షుడు వచ్చాడు.  1983  వన్డే ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ 36వ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాడు. మూడేండ్ల పాటు బీసీసీఐకి సేవలందించిన దాదా శకం ముగిసింది. 

BCCI Announces Roger Binny As New President,  Sourav Ganguly Era Ends
Author
First Published Oct 18, 2022, 1:53 PM IST

సంచలనాలేమీ జరుగలేదు.  లాస్ట్ మినిట్ షాకులేమీ లేవు. అంతా అనుకున్నట్టుగానే  బీసీసీఐకి కొత్త అధ్యక్షుడిగా 1983 వన్డే ప్రపంచకప్ హీరో  రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. ఈ మేరకు బోర్డు సభ్యులు ముంబైలో నిర్వహించిన ఏజీఎం సమావేశం తర్వాత బీసీసీఐ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.  ముంబైలోని తాజ్ హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి సౌరవ్ గంగూలీతో పాటు తిరిగి తన పదవిని దక్కించుకున్న జై షా,   ఐపీఎల్ అధ్యక్షుడు కాబోతున్న అరుణ్ ధుమాల్, బీసీసీఐ మాజీ, తాజా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. 

కొద్దిరోజుల క్రితం ముంబై వేదికగా జరిగిన బోర్డు సమావేశంలో  దాదాను కాదని రోజర్ బిన్నీ పేరును తెరమీదకు తెచ్చిన బోర్డు పెద్దలు..  గంగూలీకి చెక్ పెట్టారు.  అతడిని నామినేషన్ వేయనీయలేదు. అధ్యక్ష పదవికి  బిన్నీ తప్ప మరే ఇతర నామినేషన్ లేకపోవడంతో  అతడే అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. 

 

భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆంగ్లో ఇండియన్ గా ఘనత దక్కించుకున్న బిన్నీ ఇప్పుడు దేశంలోని అత్యున్నత  క్రికెట్ బోర్డుకు కూడా అధ్యక్షుడు కావడం గమనార్హం. బోర్డు అధ్యక్షుడిగా కూడా ఒక ఆంగ్లో ఇండియన్ ఎంపిక కావడం ఇదే తొలిసారి.  67 ఏండ్ల బిన్నీ నేటి సాయంత్రం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

 

భారత జట్టుకు 1979 నుంచి 1987 వరకు ప్రాతినిథ్యం వహించిన బిన్నీ.. దేశం తరఫున  27 టెస్టులు,  72 వన్డేలు ఆడాడు. టెస్టులలో 830 పరుగులు చేయగా  47 వికెట్లు తీశాడు. వన్డేలలో 629 పరుగులు చేసి 77 వికెట్లు పడగొట్టాడు.  1983 వన్డే ప్రపంచకప్ లో బిన్నీ.. అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో బిన్నీ 18 వికెట్లు తీయడమే గాక బ్యాట్ తో విలువైన పరుగులు చేశాడు. అంతేగాక 1985 వరల్డ్ సిరీస్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో కూడా 17 వికెట్లతో చెలరేగాడు. 

బిన్నీతో పాటు ఆఫీస్ బేరర్లుగా ఆశిశ్ షెలార్ (ట్రెజరర్), రాజీవ్ శుక్లా  (ఉపాధ్యక్షుడు), దేవ్‌జిత్ సైకియా (జాయింట్ సెక్రటరీ) ఏక్రగీవంగా ఎంపికయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios