టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి జట్టుకి ప్రకటించిన బీసీసీఐ... పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా...
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ... అంతకుముందు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో టీ20 ట్రై సిరీస్ ఆడనున్న టీమిండియా...

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగించుకున్న భారత మహిళా జట్టు, వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో పర్యటించనుంది. సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్‌తో కలిసి త్రైపాక్షిక సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఆ తర్వాత సౌతాఫ్రికాలో జరిగే ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాల్గొనబోతోంది భారత మహిళా జట్టు... ఈ రెండు సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ...
2023 జనవరి నెలలో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లే భారత మహిళా జట్టు.. జనవరి 19న సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడుతుంది. ఆ తర్వాత జనవరి 23న వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆడుతుంది. జనవరి 28న సౌతాఫ్రికాతో రెండో టీ20, 30న వెస్టిండీస్‌తో చివరి మ్యాచ్ ఆడుతుంది. మూడు జట్లలో అత్యధిక విజయాలతో టాప్‌లో నిలిచిన రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది..
ఈ ట్రై సిరీస్ మ్యాచులన్నీ ఈస్ట్ లండన్‌లో ఉన్న బఫెలో పార్కులో జరుగుతాయి. టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ ట్రై సిరీస్‌ని భావిస్తున్నాయి మూడు జట్లు.
ట్రై సిరీస్‌కి భారత మహిళా జట్టు ఇది: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యషికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి సర్వాణీ, సుష్మా వర్మ, అమన్‌జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే
ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, ఈ సిరీస్‌లో ఆడుతుంది. ట్రై సిరీస్ ముగిసిన తర్వాత 10 రోజులకు టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది..
కేప్ టౌన్ వేదికగా ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో మొట్టమొదటి మ్యాచ్ ఆడే భారత మహిళా జట్టు, 15న వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్ ఆడుతుంది. టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఈ రెండు మ్యాచులు కేప్‌టౌన్ వేదికగా జరుగుతాయి.
ఆ తర్వాత పోర్ట్ ఎలిజిబెత్‌కి వెళ్లే టీమిండియా అక్కడ ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో మ్యాచులు ఆడుతుంది. కేప్‌టౌన్‌లో ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది...
టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి భారత మహిళా జట్టు ఇది: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, యషికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి సర్వాణీ, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే
రిజర్వు ప్లేయర్లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్