India win 5th ICC U-19 World Cup:  అంటిగ్వాలో అదరగొట్టిన టీమిండియా కుర్రాళ్లకు  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి...  

భారత్ కు ఐదో అండర్-19 ప్రపంచకప్ అందించిన కుర్రాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. వరుసగా నాలుగో ఫైనల్ ఆడిన టీమిండియా.. ఇంగ్లాండ్ పై అన్నివిభాగాల్లో పై చేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. శనివారం రాత్రి అంటిగ్వా (వెస్టిండీస్) వేదికగా సర్ వివిన్ రిచర్డ్స్ గ్రౌండ్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లీష్ జట్టు పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కప్ గెలవగానే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు.

అనంతర ప్రపంచకప్ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సౌరవ్ గంగూలీ, జై షా లు ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. 

Scroll to load tweet…

 జై షా స్పందిస్తూ.. ‘ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటిస్తున్నాం. మీ ప్రదర్శనలను చూస్తే చాలా గర్వంగా ఉంది. మీరు దేశం గర్వించేలా చేశారు..’ అని ట్వీట్ చేశాడు. 

ఇక ఇదే విషమయై గంగూలీ స్పందిస్తూ..‘అండర్-19 జట్టుకు అభినందనలు. బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి ఒక చిన్న ప్రశంసా చిహ్నం మాత్రమే.. జట్టుకోసం వాళ్లు పడ్డ కృషి విలువకట్టలేనిది. అద్భుతంగా ఆడారు..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

భారత్ కు ఐదో ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్ సేనపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. దేశ ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కుర్రాళ్లకు అభినందనలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన మోడీ.. భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా, సమర్థుల చేతుల్లో ఉందని కొనియాడారు.

కాగా.. నిన్నటి మ్యాచులో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. భారత పేస్ ద్వయం రవికుమార్, రాజ్ బవలు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను జేమ్స్ ర్యూ (95), జేమ్స్ సేల్స్ (34 నాటౌట్) ఆదుకున్నారు. వాళ్లిద్దరూ ఆడకుంటే ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేసేది కాదు. వీరి పోరాటంతో ఇంగ్లీష్ జట్టు 189 పరుగులు చేసి ఆలౌటైంది. రాజ్ బవ కు ఐదు వికెట్లు దక్కగా.. యువ పేసర్ రవికుమార్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. 

అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (50), నిశాంత్ సింధు (50 నాటౌట్), రాజ్ బవ (35) రాణించడంతో భారత్.. 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి అఖండ విజయం సాధించింది. 

సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లాండ్ : 44.5 ఓవర్లలో 189 ఆలౌట్
ఇండియా : 47.4 ఓవర్లలో 195/6