Age Detection Software: క్రికెట్ లో ఆటగాళ్ల వయసుకు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ప్రక్రియలో లోపాలను గుర్తించి మోసగాళ్ల ఆట కట్టేందుకు అధునాతన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది.
వయసును తక్కువగా చూపి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూసే మోసగాళ్ల ఆట కట్టేందుకు బీసీసీఐ సరికొత్త చర్యలకు ఉపక్రమించింది. తమ అసలు వయసును దాచి దొంగ సర్టిఫికెట్లు, పైరవీలతో మోసాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే గుర్తించేందుకు గాను అధునాతన సాంకేతికతను ఉపయోగించనున్నది. ఇప్పటివరకు ఆటగాళ్ల వయసును నిర్దారించే టీ3 విధానానికి (ఎడమ చేతి మణికట్టు ఎక్స్‌రే ఆధారంగా) స్వస్తి చెప్పనుంది. దీని స్థానంలో BoneXpert Softwareను ఉపయోగించి ఆటగాళ్ల వయసును క్షణాల్లో అంచనా వేయనుంది.
అసలు విషయానికొస్తే.. బీసీసీఐ ఇన్నాళ్లు టీ3 విధానం ద్వారానే ఆటగాళ్ల వయసును నిర్ధారిస్తున్నది. దీని ప్రకారం.. రాష్ట్ర అసోసియేషన్లలో సదరు క్రికెటర్లకు ఎక్స్‌రే లను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ బీసీసీఐకి చెందిన అధికారితో పాటు స్థానికంగా ఉండే వైద్యలు పర్యవేక్షణలో జరుగుతుంది. అక్కడ్నుంచి దానిని బీసీసీఐలోని ఏవీపీ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు.
ఏవీపీ డిపార్ట్మెంట్ కు వచ్చిన శాంపిల్స్ ను వాటిని సరైన పద్ధతిలో అమర్చి ఇద్దరు రేడియాలజిస్టులతో పరీక్షలు నిర్వహిస్తారు. ఇదంతా జరగడానికి ఎంతలేదన్నా 3 నుంచి 4 రోజులు పడుతున్నది. అదీగాక ఒక్కో పరీక్షకు అయ్యే ఖర్చు సుమారుగా రూ. 2,400 దాకా అవుతున్నది.
కానీ బోన్ ఎక్స్‌పర్ట్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంత తతంగం అవసరం లేదు. అధునాతన సాంకేతిక వ్యవస్థ ద్వారా నడిచే ఈ సాఫ్ట్‌వేర్ లో ఒక వ్యక్తి బోన్ ఏజ్ ను ఇట్టే గుర్తించవచ్చు. టీ20 మెథడ్ మాదిరిగా దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. అంతా క్షణాల్లోనే ఫలితాలు బయటకు వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రక్రియలో ఒక్కో టెస్టుకు బీసీసీఐకి అయ్యే ఖర్చు రూ. 288 మాత్రమే.
సమయాభావంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుండటంతో బీసీసీఐ ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ విధానంలో పలు ప్రయోగాత్మక పరీక్షలు చేసిన బీసీసీఐ ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని త్వరలోనే పూర్తిస్తాయిలో అమలు పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఈ ప్రక్రియను ముఖ్యంగా అండర్-16, అండర్-19 లో విరివిగా వాడాలని బీసీసీఐ భావిస్తున్నది.
గతంలో అండర్-19 ప్రపంచకప్‌కు ఆడిన పలువురు క్రికెటర్లు తమ వయసును తక్కువగా చూపించి టీమిండియాకకు ఆడారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ ఆటగాడు రసిక్ ఆలం, మనోజ్ కర్ల, అంకిత్ బావ్నేతో పాటు ఈ ఏడాది వెస్టిండీస్ వేదికగా ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన రాజవర్ధన్ హంగర్గేకర్‌పైనా ఇవే ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్నుంచి బీసీసీఐ.. ఆటగాళ్ల వయసుమీద అప్రమత్తంగా ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేసిందని తెలుస్తున్నది.
