ఐర్లాండ్ బ్యాటర్ బారీ మెక్‌కార్తీ అద్భుత హాఫ్ సెంచరీ... టీమిండియా ముందు 140 పరుగుల టార్గెట్ పెట్టిన ఐర్లాండ్.. రెండేసి వికెట్లు తీసిన రవి భిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టినా, ప్రసిద్ధ్ కృష్ణ టీ20 ఎంట్రీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ అదే బౌలింగ్‌ కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగుల స్కోరు చేయగలిగింది. ఐర్లాండ్ బ్యాటర్ బారీ మెక్‌కార్తీ అద్భుత హాఫ్ సెంచరీతో ఐర్లాండ్‌ ఈ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 


ఐర్లాండ్‌తో తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా. రీఎంట్రీలో జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి బంతికి ఆండ్రూ బాల్బరీన్ ఫోర్ బాదాడు. అయితే రెండో బంతికి బాల్బరీన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఆ తర్వాత 3, 4 బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన లోర్కన్ టక్కర్, సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

రీఎంట్రీ తర్వాత వేసిన మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు జస్ప్రిత్ బుమ్రా. టీ20ల్లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు బుమ్రా. ఇంతకుముందు 2022లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు హార్ధిక్ పాండ్యా..

టీ20ల్లో మొదటి ఓవర్‌లో 2 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు 2016లో రవిచంద్రన్ అశ్విన్, శ్రీలంకపై.. 2022లో ఆఫ్ఘాన్‌పై భువనేశ్వర్ కుమార్, 2023లో వెస్టిండీస్‌పై హార్ధిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించారు.. 

టీ20ల్లో 72 వికెట్లు పూర్తి చేసుకున్న జస్ప్రిత్ బుమ్రా, టీమిండియా తరుపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అశ్విన్ రికార్డును సమం చేశాడు. యజ్వేంద్ర చాహాల్ 96, భువనేశ్వర్ కుమార్ 90, హార్ధిక్ పాండ్యా 73 వికెట్లతో అశ్విన్, బుమ్రా కంటే ముందున్నారు..


16 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన హారీ టెక్టర్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌ని రవి భిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన జార్జ్ డాక్‌రెల్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఐర్లాండ్..


ఈ దశలో మార్క్ అదైర్, కర్టీస్ కాంపర్ కలిసి ఆరో వికెట్‌కి 24 బంతుల్లో 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన మార్క్ అదైర్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకి ఫలితం దక్కింది..

జస్ప్రిత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో వరుసగా 4, 6 బాదిన కర్టీస్ కాంపర్ 13 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో 4, 6,4 బాదిన మెక్‌కార్తీ 15 పరుగులు రాబట్టాడు. దీంతో 100 దాటడమే కష్టం అనుకున్న ఐర్లాండ్, 17 ఓవర్లలోనే 114 పరుగులు దాటేసింది.

ఏడో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత కర్టీస్ కాంపర్‌ని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన కర్టీస్ కాంపర్, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 4, 2, 6, 6 బాదిన బారీ మెక్‌కార్తీ... టీ20ల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి టీమిండియాపై అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు బారీ మెక్‌కార్తీ.