Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: కోహ్లిని మళ్లీ గెలికిన బర్మీ ఆర్మీ.. ఔట్ అయి పెవిలియన్ కు వెళ్తుండగా..

ENG vs IND: గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి వైఫల్యం ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో కూడా.. 

Barmy Army Mocks Virat Kohli Again after He Got Out by Ben Stokes in Edgbaston Test
Author
India, First Published Jul 4, 2022, 3:05 PM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. మూడేండ్లుగా సెంచరీ లేక ఇబ్బందులు పడుతున్న కోహ్లి.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్ లో  19 బంతులాడి 11 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా 40 బంతులాడి  20 పరుగులే చేసి ఔటయ్యాడు. కాగా ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్లినా కోహ్లిని గెలికే బర్మీ ఆర్మీ (ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అభిమానులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఓ గ్రూప్).. ఈ టెస్టులో కూడా అదే రిపీట్ చేసింది.  

రెండో ఇన్నింగ్స్ లో కోహ్లి.. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో  రూట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో కోహ్లిని చూసి బర్మీ ఆర్మీ.. పెద్ద పెట్టున నినాదాలు చేసింది. ‘చీరియో కోహ్లి.. చీరియో’ (బాయ్ బాయ్ చెప్పడం వంటిది) అని నినదించింది.  

కోహ్లి పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో అతడిని చూస్తూ అభ్యంతరకర సైగలతో పలువురు ఇంగ్లాండ్ అభిమానులు వ్యవహరించిన తీరు టీమిండియా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. ‘మీ ఎమోషన్స్ ను కొంచెం దాచి పెట్టుకోండి. కోహ్లి ఇంకా రెండు సిరీస్ లు ఆడతాడు. జాగ్రత్త..‘ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఇక కోహ్లిని బర్మీ ఆర్మీ టార్గెట్ చేయడం ఇదేం కొత్త కాదు. ఇదే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అతడు ఔట్ అయి డగౌట్ కు వెళ్తున్నప్పుడు కూడా పలువురు ఇంగ్లాండ్ అభిమానులు అతి చేశారు.  

 

గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా బర్మీ ఆర్మీ.. కోహ్లిని టార్గెట్ గా చేసుకుంది. హెడ్డింగ్లీలో జరిగిన మూడో టెస్టులో కోహ్లిని అండర్సన్ ఔట్ చేయడంతో అతడు పెవిలియన్ కు వెళ్తుండగా ఇలాగే గోల చేశారు. అంతకుముందు లార్డ్స్ టెస్టులో కూడా ఇంగ్లాండ్ అభిమానులు టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ మీద బాటిళ్లు విసరడంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లి.. వాటిని వాళ్ల మీదకే విసరాలని రాహుల్ కు సూచించాడు. 

ఇక ఎడ్జబాస్టన్ టెస్టులో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను  284 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ఇప్పటికే 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం పుజారా (50 నాటౌట్), పంత్ (30 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  నాలుగో రోజు ఆటలో  ఏ జట్టు ఆధిపత్యం కొనసాగిస్తే టెస్టు ఆ జట్టును గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా  ఉన్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios