Asianet News TeluguAsianet News Telugu

గాయాన్ని లెక్కేచేయకుండా పోరాడిన రోహిత్.. భారత్‌‌కు తప్పని ఓటమి.. సిరీస్ బంగ్లా కైవసం..

BANvsIND ODI: మూడు రోజుల క్రితం  ఢాకా వేదికగా ముగిసిన తొలి వన్డేలో  ప్రేక్షకులకు  అందిన ఫన్ ను మరింత  పంచుతూ రెండో వన్డేలో  కూడా ఇరు జట్లు హోరాహోరిగా పోరాడాయి. కానీ విజయం మాత్రం బంగ్లాదేశ్ నే వరించింది. 
 

BANvsIND : Injured Rohit Sharma Fighting Knock in Vain, Bangladesh Beat  India by 5 Runs and Seal The Series
Author
First Published Dec 7, 2022, 8:04 PM IST

భారత్ - బంగ్లాదేశ్ మధ్య ఉత్కంఠభరితంగా ముగిసిన  రెండో వన్డేలో ఆతిథ్య జట్టు  ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.  విజయం కోసం భారత్ చివరి బంతి వరకూ పోరాడింది.   గాయాన్ని లెక్కచేయకుండా  టీమిండియా సారథి రోహిత్ శర్మ   పోరాడినా  విజయం మాత్రం  బంగ్లానే వరించింది.  చివరి ఓవర్లో  20 పరుగులు చేయాల్సి ఉండగా.. రోహిత్ 14 పరుగులే రాబట్టాడు.  65 కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56), రోహిత్ శర్మ (51 నాటౌట్) పోరాడినా ఫలితం భారత్ కు అనుకూలంగా రాలేదు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో  భారత్  నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా బంగ్లాదేశ్.. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే  సిరీస్ ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. 

లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే  షాకులు తాకాయి.  గాయం కారణంగా రోహిత్ శర్మ   ఓపెనర్ గగా రాకపోవడంతో  శిఖర్ ధావన్ కు జతగా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. కానీ కోహ్లీ.. 6 బంతుల్లో 5 పరుగులే చేసి ఎబాదత్ హోసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి తడబడుతున్న శిఖర్ ధావన్ కూడా 10 బంతుల్లో 8 పరుగులే చేసి  ముస్తాఫిజుర్ బౌలింగ్ లో  మెహిది హసన్ కు క్యాచ్ ఇచ్చాడు.  

ఇక ఈ మ్యాచ్ లో  భారత్   ఐదోస్థానంలో రాహుల్ ను కాకుండా వాషింగ్టన్  సుందర్ ను  పంపించి ప్రయోగం చేసింది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. సుందర్.. 28 బంతుల్లో 14 పరుగులే  చేసి షకిబ్ అల్  హసన్  బౌలింగ్ లో  లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చాడు. 

మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  శ్రేయాస్.. బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాడు.   సుందర్ నిష్క్రమించాక.. కెఎల్ రాహుల్ తో కలిసి   నాలుగో వికెట్ కు  25 పరుగులు జోడించాడు.  కానీ  రాహుల్.. 28 బంతుల్లో 14 పరుగులు చేసి  మెహిది హసన్ బౌలింగ్ లో  ఎల్బీడబ్ల్యూగా  వెనుదిరిగాడు.  దీంతో భారత్ 65 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. రాహుల్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్.. (56 బంతుల్లో 56, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అయ్యర్ కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు  102 పరుగులు జోడించారు.    ముస్తాఫిజుర్ వేసిన 25వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీసి 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.  25 ఓవర్లకు భారత్ స్కోరు 117-4గా ఉంది. 

స్కోరుబోర్డు మరీ నెమ్మదిగా కదులుతుండటంతో  శ్రేయాస్, అక్షర్ లు వికెట్ల మధ్య పరుగులు తీశారు.  మెహిది హసన్ వేసిన 35వ ఓవర్లో మూడో బంతికి  సిక్సర్ కొట్టిన శ్రేయాస్..  ఆరో బంతికి  అఫిఫ్ హోసేన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది.  నజూమ్ అహ్మద్ వేసిన  36వ ఓవర్  రెండో బంతికి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అక్షర్ కూడా ఎబాదత్  హోసేన్ వేసిన  39వ ఓవర్ తొలి బంతికి  ఔటయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన  శార్దూల్ ఠాకూర్ (7), దీపక్ చాహర్ (11) లు కూడా  విఫలమయ్యారు. 

రోహిత్ రఫ్ఫాడించినా.. 

శార్దూల్  నిష్క్రమణ తర్వాత  గాయంతో ఇబ్బంది పడుతున్నా  రోహిత్ శర్మ బ్యాటింగ్ కు వచ్చాడు. చాహర్ నిష్క్రమించినా ఒంటరిపోరాటం చేశాడు. ఎబాదత్ వేసిన 46వ ఓవర్లో రెండు సిక్సర్లు, బౌండరీ బాదాడు...మహ్మదుల్లా వేసిన తర్వాతి ఓవర్లో ఒకటే పరుగొచ్చింది. ఇక చివరి 18 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా.. ముస్తాఫిజుర్ వేసిన 48వ ఓవర్ మెయిడిన్ ఓవర్ అయింది. 49వ ఓవర్‌ను మహ్మదుల్లా వేయగా.. తొలి బంతిని రోహిత్ డీప్ మిడ్ వికెట్ మీదుగా  భారీ సిక్సర్ బాదాడు. తర్వాత బంతికి వైడ్, ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులొచ్చాయి. మూడో బంతికి  రోహిత్ భారీ షాట్ ఆడగా.. ఎబాదత్ క్యాచ్ మిస్ చేశాడు. నాలుగో బంతికి  మరో భారీ సిక్స్. ఐదో బంతికి రోహిత్ మరో భారీ షాట్. మళ్లీ మిస్. ఆరో బంతికి సిరాజ్ బౌల్డ్.. 

ఇక ఆఖరి  ఓవర్లో  20 పరుగులు చేయాల్సి ఉండగా..  తొలి బంతికి  పరుగులేమీ రాలేదు. తర్వాత రెండు బంతులు రెండు ఫోర్లు. నాలుగో బాల్ మిస్. ఐదో బంతికి  రోహిత్ భారీ సిక్సర్.  చివరి బంతికి ఆరు పరుగులు కావాలి. ముస్తాఫిజుర్ చివరి బంతికి  యార్కర్ వేశాడు. కానీ  హిట్ మ్యాన్  మిస్ అయ్యాడు. అంతే బంగ్లా విజయం. ఈ గెలుపుతో బంగ్లాదేశ్  2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios