ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు అవసరాలు ఇలా వివిధ కోణాల్లో జల్లెడపట్టి మరీ  ప్రపంచ కప్ జట్లను ఎంపిక చేస్తున్నారు. ఇలా ఇప్పటికే  టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లు ప్రపంచ కప్ మొగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించగా తాజాగా బంగ్లాదేశ్ కూడా కొద్దిసేపటి క్రితమే తమ జట్టును ప్రకటించింది. అయితే ఆటగాళ్ల ఎంపిక విషయంలో బంగ్లా సెలెక్టర్లు ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ వన్డే ఆడని ఆటగాడికి ఏకంగా ప్రపంచ కప్ జట్టులో స్ధానం కల్పించారు. దేశీయ క్రికెట్ లో రాణిస్తూ ఫేస్ బౌలర్ అబు జావేద్ ను బంగ్లా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి  వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని సాధించాడు. ఇలా అతడు అంతర్జాతీయ వన్డేల్లో ప్రపంచ కప్ ద్వారానే ఆరంగేట్రం చేస్తుండటం  విశేషం. 

పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన  బంగ్లా జట్టుకు కెప్టెన్ గా మష్రఫ్‌ మొర్తజా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ గా  షకీబల్ హసన్, వికెట్ కీపర్ గా ముష్పికర్ రహీమ్ వ్యవహరించనున్నారు. ఇక ఆసియా కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన  బ్యాట్ మెన్ మొసాడిక్‌ హుస్సేన్‌ మళ్లీ ప్రపంచ కప్ ద్వారా జట్టులో చేరనున్నాడు.   

బంగ్లాదేశ్‌ ప్రపంచ కప్ జట్టు:

మష్రపే బిన్ మొర్తజా(కెప్టెన్‌), షకీబల్‌ హసన్‌(వైస్‌ కెప్టెన్‌), ముష్ఫికర్‌ రహీం(వికెట్ కీపర్), తమీమ్‌ ఇక్బాల్‌, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్‌, లిట్టన్‌ దాస్‌, సబ్బీర్‌ రెహమాన్‌, మెహిది హసన్‌ మీరజ్, మహ్మద్‌ మిథున్‌, రూబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, మొసాడిక్‌ హుస్సేన్‌, అబు జాయేద్‌ చౌదరీ