Asianet News TeluguAsianet News Telugu

బంగ్లా క్రికెటర్లు ఇంతలా మారిపోయారా... ఆఖరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్‌కి ‘గార్డ్ ఆఫ్ హానర్’...

ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌కి ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించిన బంగ్లా జట్టు... రెండో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో బంగ్లా...

Bangladesh Cricket team given guard of honor to New Zealand cricketer Ross Taylor
Author
India, First Published Jan 10, 2022, 11:47 AM IST

బంగ్లాదేశ్ క్రికెటర్లకు కాస్త ఆవేశం, తొందరపాటు చాలా ఎక్కువ. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఈ విషయం రుజువైంది కూడా. దాదాపు 10-15 ఏళ్లుగా క్రికెట్‌లో పసికూన అనే స్టేటస్ మోస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు కొన్ని సంచలన విజయాలు కూడా అందుకుంటోంది. న్యూజిలాండ్ పర్యటనలో మొదటి టెస్టులో అద్భుత విజయం సాధించి, ఆతిథ్య జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్...

తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, గత పదేళ్లలో న్యూజిలాండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి ఆసియా జట్టుగా చరిత్ర క్రియేట్ చేసింది బంగ్లా... బంగ్లా పులులు ఇచ్చిన దెబ్బకు రెండో టెస్టులో పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్‌ని సిద్ధం చేసింది న్యూజిలాండ్...

పచ్చగా గడ్డి పెరిగి కనిపించిన క్రిస్ట్‌చర్చ్ పిచ్‌ని చూసి క్రికెట్ ఫ్యాన్స్‌ షాక్‌కి గురయ్యారు. ఆశించినట్టుగానే ఈ పిచ్‌పై భారీ స్కోరు చేసింది న్యూజిలాండ్. 6 వికెట్ల నష్టానికి 521 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కేన్ విలియంసన్ గాయపడడంతో ఈ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టామ్ లాథమ్, భారీ ద్విశతకంతో చెలరేగాడు....

టామ్ లాథమ్ 373 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 252 పరుగులు చేసి అవుట్ కాగా విల్ యంగ్ 54, డి వాన్ కాన్వే 166 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 109 పరుగులు చేశాడు. ఆఖరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ క్రీజులోకి బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో బంగ్లా ప్లేయర్లు ‘గార్డ్ ఆఫ్ హానర్‌’తో స్వాగతం పలికారు. సాధారణంగా ఆఖరి టెస్టు ఆడుతున్న ప్లేయర్ క్రీజులోకి వస్తుంటే సొంత జట్టు ప్లేయర్లు గార్డ్ ఆఫ్ హానర్‌తో స్వాగతమిస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రత్యర్థి జట్టు నుంచి ప్లేయర్లకు ఇలాంటి గౌరవం దక్కుతుంది...

రాస్ టేలర్‌కి ఇలాంటి గౌరవం ఇచ్చి, క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది బంగ్లా జట్టు. ఆవేశం, దూకుడు, పొగరు, తొందరపాటు వంటి లక్షణాలతో విమర్శలు తెచ్చుకున్న బంగ్లా జట్టులో ఇలాంటి మార్పు చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఆఖరి టెస్టు ఆడుతున్న రాస్ టేలర్ 39 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా టామ్ బ్లండెల్ 60 బంతుల్లో 8 ఫోర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

ఆసియా బ్యాట్స్‌మెన్‌కి కష్టసాధ్యమైన పిచ్‌పై బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ కూడా ఘోరంగా విఫలమైంది. షాద్మన్ ఇస్లాం 7, నజీముల్ హుస్సేన్ 4, లిటన్ దాస్ 8, మెహెడి హసన్ 5, టస్కీన్ అహ్మద్ 2 పరుగులు, షోరిఫుల్ ఇస్లాం 2 పరుగులు చేసి అవుట్ కాగా  యాసిర్ ఆలీ 95 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు, నురుల్ హసన్ 62 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేసి డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేశారు...

న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌కి 5 వికెట్లు దక్కగా టిమ్ సౌథీ 3, కేల్ జెమ్మీసన్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్కోరుకి 395 పరుగులు వెనకబడి ఉంది బంగ్లాదేశ్ జట్టు. న్యూజిలాండ్, బంగ్లాను ఫాలో ఆన్ ఆడిస్తుందా... లేక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది...

Follow Us:
Download App:
  • android
  • ios