సౌతాఫ్రికా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ జట్టు... తొలి వన్డేలో సఫారీ టీమ్‌పై 38 పరుగుల తేడాతో విజయం... ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్‌తో సిరీస్ నుంచి తప్పుకోవాలని భావించిన సౌతాఫ్రికా క్రికెటర్లకు ఊహించని షాక్...
విరాట్ కోహ్లీ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విదేశాల్లో ఆడిన మొట్టమొదటి వన్డే సిరీస్‌లోనే క్లీన్ స్వీప్ అయ్యింది టీమిండియా. రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో సౌతాఫ్రికా టూర్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడిన మూడు వన్డేల్లో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది...
అయితే భారత జట్టు చేయలేని పనిని, బంగ్లాదేశ్ సునాయాసంగా చేసి చూపించింది. సౌతాఫ్రికా టూర్‌లో మొదటి వన్డేలో బంగ్లా 38 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. సౌతాఫ్రికాలో బంగ్లాదేశ్‌కి ఇదే తొలి విజయం. ఇప్పటిదాకా సఫారీ గడ్డపై వన్డేల్లో కానీ, టెస్టుల్లో కానీ, టీ20ల్లో కానీ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది బంగ్లాదేశ్...
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగుల భారీ స్కోరు చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ కలిసి తొలి వికెట్‌కి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, బంగ్లాకి శుభారంభం అందించారు...
67 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్ అవుటైన తర్వాతి ఓవర్‌లోనే 67 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన లిటన్ దాస్ కూడా పెవిలియన్ చేరాడు...
ముస్తాఫికుర్ రహీన్ 9 పరుగులు చేసి నిరాశపరిచినా షకీబ్ అల్ హసన్ 64 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు, యసిర్ ఆలీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులతో రాణించారు...
మహ్మదుల్లా 17 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 25 పరుగులు, అఫిఫ్ హుస్సేన్ 17, మెహిడీ హసన్ 19, తస్కీన్ అహ్మద్ 7 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. 315 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా 48.5 ఓవర్లలో 276 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
జానేమన్ మలాన్ 4, కేల్ వెరెన్నే 21, తెంబ భవుమా 31 పరుగులు చేయగా అయిడిన్ మార్క్‌రమ్ డకౌట్ అయ్యాడు. రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 98 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 86 పరుగులు, డేవిడ్ మిల్లర్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
అండిలో ఫెలూక్వాయో 2, మార్కో జాన్సెన్ 2, కగిసో రబాడా 1 పరుగు చేసి అవుట్ కాగా కేశవ్ మహరాజ్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు, లుంగి ఇంగిడి 10 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశారు. మెహిడీ హసన్ 4 వికెట్లు తీయగా, తస్కీన్ అహ్మద్‌కి 3 వికెట్లు, షోరిఫుల్ ఇస్లాంకి 2 వికెట్లు దక్కాయి.
ఐపీఎల్ ఆరంభానికి ముందు జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో ఆడేందుకు చాలామంది సౌతాఫ్రికా ప్లేయర్లు ఆసక్తి చూపించలేదు. బంగ్లా టీమ్‌తో ఆడడం కంటే ఐపీఎల్ ఆడితే ఎక్కువ డబ్బులు వస్తాయని బోర్డుకి చెప్పేసిన తర్వాతి రోజే... సఫారీ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్.
