BAN vs AFG: బంగ్లాదేశ్ - అఫ్గానిస్తాన్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లా విజయం దిశగా దూసుకుపోతున్నది.
బంగ్లాదేశ్ యువ సంచలనం నజ్ముల్ హోసేన్ శాంటో సంచలన బ్యాటింగ్ తో అఫ్గానిస్తాన్ తో ఢాకా వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లా.. అఫ్గాన్ పై విజయం దిశగా సాగుతున్నది. ఈ టెస్టులో శాంటో.. వరుసగా రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు చేసి బంగ్లా జట్టు భారీ స్కోరును సాధించాడంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేయడం ద్వారా అతడు అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో శాంటో.. 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 115 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో కూడా శాంటో.. 151 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 124 రన్స్ సాధించాడు.
బ్యాక్ టు బ్యాక్ సెంచరీల ద్వారా శాంటో.. బంగ్లాదేశ్ తరఫున అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో ఇలా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన బ్యాటర్ గా మోమినుల్ హక్ పేరిట ఘనత ఉండేది. మోమినుల్.. 2018లో శ్రీలంకతో చిట్టగాంగ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు చేశాడు. ఆ జాబితాలో ఇప్పుడు శాంటో చేరాడు. ఇక అఫ్గనిస్తాన్ పై రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా శాంటో రికార్డులకెక్కాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించినవారిలో శాంటో 91వ క్రికెటర్ కావడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్.. 382 పరుగులకు ఆలౌట్ అయింది. శాంటో సెంచరీతో పాటు మహ్మదుల్ హసన్ జాయ్ (76), మోహిది హాసన్ (48) రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో అఫ్గాన్.. 146 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ జజాయ్ టాప్ స్కోరర్. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాకు 236 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా.. 80 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 425 పరుగుల భారీ స్కోరు చేసింది. శాంటోతో పాటు మోమినుల్ హక్ (121) కూడా సెంచరీ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో అఫ్గాన్ ఎదుట 661 పరుగుల లక్ష్యం నిర్దేశించినట్టైంది. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసేసమయానికి అఫ్గానిస్తాన్.. 11 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా ఆ జట్టు విజయానికి 617 పరుగులు కావాలి. బంగ్లా బౌలర్లకు రెండు రోజుల్లో 8 వికెట్లు తీస్తే విజయం సొంతమవుతుంది.
