బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరకు బెంగళూరు జట్టే విజేతగా నిలిచింది. ఇరు జట్ల ఆటగాళ్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ మైదానంలోపల, బయట వున్న ఐపిఎల్ ప్రేక్షకులకు పసందైన క్రికెట్ మజాను అందించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లే కాదు అంపైర్ కూడా తన మతిమరుపుతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. 

బెంగళూరు మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సిబి మొదట బ్యాటింగ్ చేపట్టాల్సివచ్చింది. అయితే ఇలా ఆర్సిబి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రతి మ్యాచ్ లో మాదిరిగానే 14వ ఓవర్ తర్వాత స్ట్రాటెజిక్ టైమ్ ఔట్ బ్రేక్ ను ప్రకటించారు. అయితే ఈ టైమౌట్ ముగిసిన తర్వాత అందరు ఆటగాళ్లు తమ తమ స్థానాల్లోకి చేరుకున్నారు. బ్యాట్ మెన్స్ కూడా రెడీ అవగా బౌలర్, అపైర్లు గందరగోళంగా దేనికోసమో వెతుక్కుంటున్నారు. ఆ తర్వాత  తెలిసింది వారు వెతుకుతున్నది బంతి కోసమని. 
 
మురుగన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ బౌలింగ్ చేయగా ఆ తర్వాత టైమ్ ఔట్ ప్రకటించారు. దీంతో అతడు బంతిని అంపైర్ శంషుద్దిన్ కు అందించాడు. అతడే దాన్ని  తన జేబులో పెట్టుకున్నాడు. టైమౌట్ తర్వాత తిరిగి మ్యాచ్ ఆరంభమవగా పంజాబ్ కెప్టెన్ అశ్విన్ రాజ్‌పూత్ ను బౌలింగ్ కు దించాడు. అయితే అతడు అంపైర్ ను బంతి ఇవ్వాల్సిందిగా కోరగా బిత్తరపోవడం అతడి వంతయ్యింది. 

కొద్దిసేపు బంతి కోసం వెతుకులాడిన తర్వాత దొరక్కపోవడంతో అంపైర్ కొత్తబంతిని తెప్పించాడు. అయితే పాత బంతి ఎక్కడికిపోయిందని 14వ ఓవర్ తర్వాత ఏం జరిగిందో వీడియో టీమ్ పరిశీలించింది. దీంతో బంతి అంపైర్ శంషుద్దిన్ జేబులో వున్న విషయం బయటపడింది. ఈ సమాచారంతో బంతి తన జేబులోనే వున్నట్లు తెలుసుకుని అంపైర్ నవ్వుకుంటూ దాన్ని బయటకు తీశాడు. ఇలా అంపైర్ మతిమరుపు కారణంగా మ్యాచ్ లో కాస్సేపు గందరగోళం నెలకొంది.