భారత దిగ్గజాన్ని కలిసిన పాకిస్తాన్ సారథి.. బ్యాటింగ్ పాఠాలు చెప్పిన సన్నీ
T20 World Cup 2022: టీమిండియాతో కీలక పోరుకు ముందు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను కలిశాడు. తనను కలిసిన బాబర్ కు సన్నీ విలువైన బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఈనెల 23న జరుగబోయే మ్యాచ్ కోసం రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్.. భారత దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ను కలిశాడు. తన పుట్టినరోజు సందర్భంగా బాబర్ సన్నీకి కలిశాడు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్ గదికి వెళ్లిన సన్నీ.. కాసేపు బాబర్ తో పాటు ఇతర ఆటగాళ్లకు విలువైన బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు.
ఈనెల 15న 28వ పుట్టినరోజును జరుపుకున్న బాబర్.. మరుసటి రోజు రాత్రి సన్నీని కలిశాడు. ఈ సందర్బంగా సన్నీ.. బాబర్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పాడు. బ్యాటింగ్ పొజిషన్ ఎలా ఉండాలి..? బౌలర్లను ఎలా ఎదుర్కోవాలి..? షాట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది..? అనే కీలక విషయాలపై సన్నీ బాబర్ కు విలువైన సూచనలిచ్చాడు.
బాబర్ సన్నీతో మాట్లాడుతున్నప్పుడు పాకిస్తాన్ హెడ్ కోచ్ సక్లయిన్ ముస్తాక్, బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్, మరికొందరు పాక్ ఆటగాళ్లు కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా గవాస్కర్.. యూసుఫ్ టెస్టులలో సాధించిన రికార్డు (ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించడం) గురించి వాకబు తీశాడు. అతడిని ప్రత్యేకంగా అభినందించాడు. అనంతరం బాబర్ తనకు ఎంతో ఇష్టమైన క్యాప్ సన్నీకి ఇవ్వగా దానిమీద గవాస్కర్ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇదిలాఉండగా.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, క్రికెట్ పట్ల క్రేజ్ దృష్ట్యా ఈనెల 23న భారత్-పాక్ మధ్య జరుగబోయే మ్యాచ్ పై హైప్ విపరీతంగా ఉంది. కానీ క్రికెటర్లు మాత్రం ఈ మ్యాచ్ ను చాలా లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తున్నది. ఒక జట్టు ఉంటున్న హోటల్ కు ప్రత్యర్థి ఆటగాళ్లు వెళ్లడం, ఇద్దరూ కలిసి నెట్స్ లో కలిసి ప్రాక్టీస్ చేయడం, ఫోటోలకు ఫోజులివ్వడం, ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటున్నామని చెప్పడం వంటివన్నీ చూస్తుంటే అన్ని మ్యాచ్ ల మాదిరే ఇది కూడా నార్మల్ మ్యాచ్ అనే అనుమానం రాక మానదు. దీంతో గతంలో భారత్-పాక్ మ్యాచ్ అంటే ఉండే ‘వైరం’ మిస్ అవుతుందని పలువురు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.