శ్రీలంకలో ఆసియా కప్ టోర్నీ 2023, సూపర్ 4, ఫైనల్ మ్యాచులు... ప్రాక్టీస్ కోసమే లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న బాబర్ ఆజమ్... పాక్ కెప్టెన్ నిర్ణయం వెనక ఆయన తండ్రి ఆజమ్ సిద్ధికీ..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ టాప్ 5లో ఉన్న ఏకైక క్రికెటర్ బాబర్ ఆజమ్. కొన్నాళ్లుగా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో పాతుకుపోయిన బాబర్ ఆజమ్, టెస్టుల్లో టాప్ 4లో కొనసాగుతూ ఉంటే, టీ20ల్లో టాప్ 3లో ఉన్నాడు...
శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు ఆడిన, ఆతిథ్య జట్టును క్లీన్ స్వీప్ చేసింది పాకిస్తాన్. తొలి టెస్టులో 4 వికెట్ల తేడాతో నెగ్గిన పాకిస్తాన్, రెండో టెస్టులో 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో 100 శాతం విజయాలతో టాప్‌లో ఉంది పాకిస్తాన్. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ టీమ్ క్రికెటర్లు, లంకలోనే ఉండి ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్నారు..
లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రైయికర్స్ తరుపున ఆడుతున్న బాబర్ ఆజమ్, తొలి మ్యాచ్‌లో 7 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండో మ్యాచ్‌లో 54 బంతుల్లో 59 పరుగులు చేశాడు..
బాబర్ ఆజమ్, కెనడా టీ10 లీగ్‌లో కాకుండా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడడానికి ఆయన తండ్రి ఆజమ్ సిద్ధికీ కారణమట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు ఆజమ్ సిద్ధికీ...
‘గ్రీటింగ్స్ పాకిస్తాన్. బాబర్, నన్ను టెస్టు సిరీస్ సమయంలో ఓ విషయం గురించి అడిగాడు. కెనడా లీగ్‌లో 10 రోజులు ఆడితే ఎంత డబ్బు వస్తుందో, కొలంబో లీగ్‌లో 25 రోజులు ఆడినా అంతే డబ్బు వస్తుంది. కెనడాతో పోలిస్తే కొలంబోలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. నేను శ్రీలంకకి ఎందుకు వెళ్లాలి? అని అడిగాడు..
దానికి నేను ఒక్కటే చెప్పా. శ్రీలంకలో ఆసియా కప్ టోర్నీ జరగబోతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కూడా జరగనుంది. అంతేకాకుండా లంక పిచ్‌లు, ఇండియా పిచ్‌లకు దగ్గరగా ఉంటాయి. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవం, వన్డే వరల్డ్ కప్‌కి కూడా ఉపయోగపడుతుంది..
చల్లని వాతావరణంలో 10 రోజులు కెనడా లీగ్ ఆడే కంటే, స్వదేశానికి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం బెటర్. ఈ రోజు బాబర్ ఆజమ్ ఫోన్ చేసి,ఈ ఎండలు భరించలేకపోతున్నా అన్నాడు. పాకిస్తాన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. నీ కోసం పాకిస్తాన్ కూడా ప్రార్థిస్తుంది.. నీ కంటే నాకు చాలా మంచి అవగాహన సామర్థ్యం ఉంది..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘంగా రాసుకొచ్చాడు ఆజమ్ సిద్ధికీ...
ఆగస్టు 20 వరకూ లంక ప్రీమియర్ లీగ్ 2023 జరగనుంది. ఆగస్టు 22 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంకలోనే మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది పాకిస్తాన్. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 టోర్నీ మొదలవుతుంది. హైబ్రీడ్ మోడల్‌లో జరిగే ఆసియా కప్ 2023 టోర్నీలో 4 మ్యాచులు పాకిస్తాన్‌లో జరిగితే, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంక వేదికగా జరగబోతున్నాయి..
