సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా... ఆ ఒక్కటీ గెలిస్తే చాలు! డబ్ల్యూటీసీ ఫైనల్‌కి...
డబుల్ సెంచరీ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన డేవిడ్ వార్నర్... మరో మ్యాచ్ గెలిస్తే నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి..

స్వదేశంలో తిరుగులేని ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 68.4 ఓవర్లలో 189 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మార్కో జాన్సెన్ 59 పరుగులు చేయగా వికెట్ కీపర్ కేల్ విరెన్నె 52 పరుగులు చేశాడు...
కామెరూన్ గ్రీన్ 5 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 8 వికెట్లు తీసీ 575 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. డేవిడ్ వార్నర్ 255 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 200 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత గాల్లోకి ఎగురుతూ సెలబ్రేట్ చేసుకుని గాయపడిన డేవిడ్ వార్నర్, తర్వాతి రోజు మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే పరుగులేమీ జోడించకుండానే ఆన్రీచ్ నోకియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
స్టీవ్ స్మిత్ 85 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 51, కామెరూన్ గ్రీన్ 51 పరుగులు చేయగా అలెక్స్ క్యారీ 111 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తెంబ భవుమా 65 పరుగులు చేయగా కేల్ వెరెన్నే 33 పరుగులు చేశాడు. నాథన్ లియాన్ 3 వికెట్లు పడగొట్టాడు..
వరుసగా రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియా 78.57 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికి పడిపోయింది...
రెండున్నరేళ్ల తర్వాత టెస్టు సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతూ డబుల్ సెంచరీ బాది ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఈ ఫీట్ సాధించాడు. వచ్చే ఏడాది సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.
ఈ టెస్టు మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియా నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధిస్తుంది. దీంతో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో టీమండియా రెండు టెస్టులు గెలిచినా ఫైనల్‌కి చేరుతుంది...