బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో తాను అవుటైన తీరుపై వచ్చిన విమర్శలకు టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జవాబు ఇచ్చాడు. నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడని రోహిత్ శర్మపై సునీల్ గవాస్కర్, సుంజయ్ మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా విమర్శించారు. నెటిజన్లు కూడా అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ స్థితిలో రోహిత్ శర్మ తన విమర్ళకు బదులిచ్చాడు. 

ఆ షాట్ ఆడినందుకు తాను పశ్చాత్తాప పడడం లేదని, గతంలో అదే టెక్నిక్ తో విజయవంతంగా బౌండరీలు సాధించానని ఆయన అన్నాడు. బౌలర్లపై ఒత్తిడి పెట్టేందుకు అలాంటి షాట్లు ఆడుతానని, ఇకపై కూడా కొనసాగిస్తానని చెప్పాడు. రెండో రోజు శనివారం ఆట ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

Also Read: రోహిత్ లాంటి ప్లేయర్, ఇలా అవుట్ అవ్వడం... ప్చ్..! సునీల్ గవాస్కర్ ఫైర్

లైయన్ తెలివైన బౌలర్ అని, కష్టతరమైన బంతులను వేస్తున్నాడని, అయితే అదే టెక్నిక్ తో గతంలో తాను ఎన్నో సార్లు ఫలితాలు రాబట్టానని, కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చునని, మరికొన్ని సార్లు ఔట్ కావచ్చునని రోహిత్ శర్మ అన్నాడు. 

దురదృష్టవశాత్తు ఈసారి ఔటయ్యానని, ఇలాంటి షాట్లు కొనసాగిస్తానని, అయితే తనపై జట్టు ఎంతో నమ్మకం ఉంచిందని, దానికి తగినట్లుగా ఆడడం తన బాధ్యత అని, విమర్శల గురించి ఆలోచించబోనని, తన దృష్టి అంతా ఆటపైనే ఉంటుందని ఆయన అన్నాడు. 

Also Read: రోహిత్ శర్మ అవుట్... రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా... 60 పరుగులకే..

బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 11 పరుగులకే శుభ్ మన్ గిల్ వికెట్ కోల్పోయింది. ఆ స్థితిలో పుజారాతో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దాడు. అయితే 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ అవుటయ్యాడు. లైయన్ వేసిన బంతిని మిడాన్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే, టైమింగ్ కుదరకపోవడంతో స్టార్క్ చేతిలోకి బంతి వెళ్లింది. దీంతో ఆయనపై అనవసరపు షాట్ కు వెళ్లాడని విమర్శలు వస్తున్నాయి.