Asianet News TeluguAsianet News Telugu

The Ashes: సారథిగా తొలి టెస్టులోనే రికార్డులు బద్దలు కొట్టిన పాట్ కమిన్స్..

Australia Vs England: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా గబ్బాలో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు తొలి రోజే తిరుగులేని ఆధిక్యం దక్కింది.  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ ను ఆసీస్.. 147 పరుగులకే కట్టడి చేసింది. 

Australia vs England: Skipper Pat Cummins becomes only second Australian to take fifer on captaincy debut
Author
Hyderabad, First Published Dec 8, 2021, 11:41 AM IST

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టును 147 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు  ఆధిక్యం సంపాదించారు. తొలి రోజే నిప్పులు చెరిగిన ఆసీస్ పేస్ త్రయం.. మిచెల్  స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్ లు ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. అయితే ఇటీవలే ఆసీస్ కు టెస్టుల్లో 47వ కెప్టెన్ గా నియమితుడైన పాట్ కమిన్స్.. పలు రికార్డులు సృష్టించాడు.  కెప్టెన్ గా తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసిన కమిన్స్.. ఈ ఘనత సాధించిన  రెండో ఆసీస్ కెప్టెన్ అయ్యాడు. 

కెప్టెన్ గా అరంగ్రేట టెస్టులోనే ఐదు వికెట్లు పడగొట్టిన వారి (ఆస్ట్రేలియా బౌలర్ల) జాబితాలో.. ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ జిఫెన్ (6-155) ఉన్నాడు. 1894లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో జార్జ్ ఈ రికార్డు సృష్టించాడు. ఆ  తర్వాత సుమారు 120 ఏండ్ల తర్వాత పాట్ కమిన్స్ ఆ రికార్డును అధిగమించాడు. ఆసీస్ కెప్టెన్ గా తొలి టెస్టులోనే ఐదు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 

 

కాగా.. బాబ్ విల్లీస్ (ఇంగ్లాండ్) తర్వాత యాషెస్ లో ఐదు వికెట్లు తీసిన కెప్టెన్లలో కూడా పాట్ కమిన్స్ స్థానం దక్కించుకున్నాడు. 1982లో ఇంగ్లాండ్ కెప్టెన్ గా వ్యవహరించిన ఆ జట్టు కెప్టెన్ బాబ్ విల్లీస్ ఈ ఘనత సాధించాడు. 

కమిన్స్ పర్ఫార్మెన్స్ కు పలువురు ఆస్ట్రేలియా  మాజీ దిగ్గజాలతో పాటు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని.. బౌలింగ్, ఫీల్డింగ్ లో మార్పులు బాగా చేశాడని కమిన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

గబ్బాలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆసీస్ పేస్ త్రయం దెబ్బకు 147 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్, కమిన్స్, హెజిల్వుడ్ దెబ్బకు ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇక పాట్ కమిన్స్.. బెన్ స్టోక్స్, హసీబ్ హమీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ లతో పాటు రాబిన్సన్ లను ఔట్ చేసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. స్టార్క్, హెజిల్వుడ్ లు తలో రెండు వికెట్లు తీశారు. వర్షం కారణంగా ఆట తాత్కాలికంగా వాయిదా పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios