Asianet News TeluguAsianet News Telugu

Ashes: బంగ్లాదేశ్ తో పోటీ పడుతున్న ఇంగ్లాండ్.. ప్చ్..! క్రికెట్ పుట్టినిల్లుకు ఎన్ని కష్టాలో...

World Test Championship Points Table: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ దారుణంగా పడిపోయింది. జో రూట్ సారథ్యంలోని ఆ జట్టు.. బంగ్లాదేశ్ తో పోటీ పడుతున్నది. 

Australia top WTC table after Third Test Against England, India eye big gain
Author
Hyderabad, First Published Dec 28, 2021, 3:20 PM IST

క్రికెట్ పుట్టినిల్లుగా పేరుగాంచిన టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన దశను ఎదుర్కుంటున్నది. మెల్బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ను కోల్పోయింది. దీంతో పాటు ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో దారుణంగా పడిపోయింది. ఈ జాబితాలో ఆసీస్ అగ్రస్థానం దక్కించుకోగా.. విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. రెండేండ్లకోసారి జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఈ ఏడాది.. న్యూజిలాండ్ జట్టు భారత్ ను ఓడించి ట్రోఫీని ఎగురేసుకుపోయిన విషయం తెలిసిందే.  

మెల్బోర్న్ లో మూడో టెస్టులో గెలవడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరింది. 2021-23 సీజన్  లో ఆసీస్ కు ఇదే తొలి సిరీస్. ఆడిన మూడు టెస్టులలో కూడా కంగారూలు ఆధిక్యాన్ని ప్రదర్శించి నెంబర్ వన్ గా నిలిచారు.  దీంతో ఆ జట్టుకు 36 పాయింట్లు దక్కాయి. ఆసీస్ తర్వాత శ్రీలంక.. రెండో స్థానంలో ఉంది. ఇటీవలే ఆ జట్టు వెస్టిండీస్ ను 2-0తో ఓడించి 24 పాయింట్లు దక్కించుకుంది.  మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం కింది నుంచి రెండో స్థానంలో ఉంది. 

 

2021-23 డబ్ల్యూటీసీ సీజన్ లో భాగంగా రెండు సిరీస్ (భారత్, ఆసీస్ లతో) లలో  ఇంగ్లాండ్ 6 టెస్టులాడింది. అందులో ఒకటి మాత్రమే గెలిచింది. నాలుగింటిలో ఓడి ఒకటి  డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్  గెలిచి, డ్రా చేసుకున్న రెండు టెస్టులు టీమిండియా మీదే. ఇటీవలే ఆగస్టులో అర్థాంతరంగా ముగిసిన నాలుగు మ్యాచులలో ఇంగ్లాండ్ ఒకదాంట్లో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు 6 పాయింట్లతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది.

 

నాలుగు ఓటములకు తోడు ఇంగ్లాండ్ కు పెనాల్టీ పాయింట్లు కూడా ఎక్కువగానే ఉండటంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దారుణంగా పడిపోయింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్.. సున్నా పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆ జట్టు ఇటీవలే పాకిస్థాన్ తో  ముగిసిన రెండు టెస్టులలోనూ ఓడిన విషయం తెలిసిందే. 

ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది.  ఈ సీజన్ లో భాగంగా భారత్ ఇప్పటికే  ఆరు టెస్టులాడింది. ఇందులో 3 విజయాలు, ఒక పరాజయం ఉంది.  రెండు టెస్టులను డ్రా చేసుకుంది. దీంతో 42 పాయింట్లతో  భారత్ నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ గెలిచి పాయింట్ల ను పెంచుకోవాలని కోహ్లి సేన భావిస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios