ఆతిథ్య ఆస్ట్రేలియాను గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. వన్డే సిరీస్‌లో గాయపడిన ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీ20 సిరీస్‌తో పాటు మొదటి టెస్టుకి కూడా దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన యువఓపెనర్ విన్ పుకోవిస్కీ కూడా మొదటి టెస్టు ఆడడం లేదు.

భారత యువ బౌలర్ కార్తీక్ త్యాగి వేసిన బౌన్సర్ బలంగా తగలడంతో పుకోవిస్కి... ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో రిటైర్ట్ హార్ట్‌గా వెనుదిరిగాడు. తాజాగా మరో స్టార్ బౌలర్ టెస్టు సిరీస్‌కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబ్బాట్... మొదటి వన్డేలో రెండు కీలక వికెట్లు తీసి భారత జట్టును ఇబ్బంది పెట్టాడు.

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆడుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్న అబ్బాట్... కాలి చీలిమండ గాయంతో బాధపడుతున్నాడు. రెండో రోజు ఆటలో ఏడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అబ్బాట్... ఆ తర్వాత పెవిలియన్ చేరాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బందిగా పడిన అబ్బాట్... తొలి టెస్టు ప్రారంభానికి కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అబ్బాట్ లేకపోతే ఆసీస్‌కు పెద్ద దెబ్బే. ఇప్పటికే వ్యక్తిగత కారణాల కారణంగా మిచెల్ స్టార్క్ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. బుమ్రా ఆడిన షాట్‌కి గాయపడిన కామెరూన్ గ్రీన్ మాత్రం టెస్టు సిరీస్‌కి అందుబాటులో ఉండడం ఆసీస్‌కి కలిసొచ్చే అంశం.