Pakistan Vs Australia: కరాచీ టెస్టు మరింత రసవత్తరంగా మారింది. ఆట మూడో రోజు పాక్ ను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్.. నాలుగో రోజు ఆ జట్టు ముందు భారీ లక్ష్యం నిలిపింది.
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టెస్టులో తిరుగులేని స్థితిలో నిలిచింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో పాట్ కమిన్స్ సేన.. పాకిస్థాన్ ముందు 506 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఆటకు రోజున్నర సమయం ఉండటం.. పిచ్ కాస్త స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో కమిన్స్ లంచ్ కు కొద్దిసేపు ముందు ఆసీస్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ వికెట్ ను కోల్పోయింది.
తొలి ఇన్నింగ్స్ లో పాక్ ను 148 పరుగులకే ఆలౌట్ చేసినా వారికి తిరిగి ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన ఆసీస్.. సెకండ్ ఇన్నింగ్స్ లో 22 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. లబూషేన్ (44) ను షాహీన్ అఫ్రిది ఔట్ చేశాక.. కమిన్స్ ఆసీస్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్ లో (44 నాటౌట్) రాణించాడు.
రెండో ఇన్నింగ్స్ ను 97 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం తో కలుపుకుని ఆసీస్ కు 505 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దీంతో 506 పరుగుల భారీ ఛేదన పాక్ మీద ఉంది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. ఐదో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది.
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు చేసిన ఇమామ్ ఉల్ హక్.. 18 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి టర్న్ అవుతుండటం.. ఆసీస్ స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా జోరుమీదుండటంతో పాక్ ఆచితూచి ఆడుతుంది. గెలవడం సంగతి అటుంచితే ఆసీస్ బౌలింగ్ ముందు పాక్ నిలబడినా గొప్పే.. కరాచీ టెస్టును కాపాడుకోవాలంటే బాబర్ ఆజమ్ సేన ఇవాళ్టితో పాటు రేపు కూడా క్రీజులో నిలవాలి. ప్రస్తుతం పాక్.. 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 498 పరుగులు చేయాలి. ఆసీస్ కు 9 వికెట్లు కావాలి.
