మెల్బోర్న్: ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్ కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నాడు. గొంతు నొప్పి రావడంతో అతనికి కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో అతను న్యూజిలాండ్ తో జరిగే తొలి వన్డేకు దూరమవుతున్నాడు. 

కేన్ రిచర్డ్సన్ ఆ విషయాన్ని జట్టు వైద్య సిబ్బందికి తెలియజేశాడు. కోవిడ్ -19కు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వైద్య నివేదిక అందాల్సి ఉంది. తొలి వన్డేకు అతని స్థానంలో సీన్ అబోట్ జట్టులోకి వచ్చాడు. 

గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, జట్టు సభ్యులకు రిచర్డ్సన్ ను దూరంగా ఉంచడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ ను పాటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి తెలిపారు.

వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వచ్ిచన తర్వాత విషయం తెలుసుకుంటామని, కొద్ది రోజుల్లో అతను కోలుకుంటాడని భావిస్తున్నామని, కోలుకోగానే జట్టులో చేరుతాడని అన్నారు. 

కరోనా వైరస్ కారణంగా ఆ,స్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రేక్షకులు లేకుండా నడుస్తుంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు లక్షా 27 వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 4,700 మంది మృత్యువాత పడ్డారు. 68 వేల మంది కోలుకున్నారు.