సిడ్నీ: మరి కొద్ది సంవత్సరాల్లో తాను టీ20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతానని ఆస్ట్రేలియా హిట్ మ్యాన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. టెస్టు, వన్డే క్రికెట్ లో ఎక్కువ కాలం కొనసాగడానికి, తన కుటుంబంతో గడపడానికి టీ20 క్రికెట్ కు గుడ్ చెబుతానని 33 ఏళ్ల వార్నర్ చెప్పాడు. 

క్రికెట్ ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్ మెడల్ ను సోమవారంనాడు అందుకున్నాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తర్వాత తిరిగి వచ్చి అదరగొడుతున్న నేపథ్యంలో ఆయన తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యాడు. అవార్డు స్వీకరించిన తర్వాత అతను ఏడ్చేశాడు. ఈ అవార్డు మొత్తంగా అతనికి మూడోది. ఈ ఏడాది ట్వంటీ20 ప్లేయర్ గా కూడా అతను ఎన్నికయ్యాడు. 

టీ20 ప్రపంచ కప్ లు వరుసగా ఉన్నయని, బహుశా మరికొద్ది సంవత్సరాల్లో ఈ ఫార్మాట్ నుంచి తాను తప్పుకోవచ్చునని, తీరికలేని షెడ్యూల్స్  తో అన్ని ఫార్మాట్లలో ఆడుతుండడం చాలా కష్టంగా ఉందని ఆయన అన్నాడు. ఎంతో కాలం అన్ని ఫార్మాట్లలో ఆడిన ఏబీ డీవిలియర్స్, వీరేంద్ర సెహ్వాగ్ లతో మాట్లాడితే అన్ని ఫార్మాట్లలో ఆడడం ఎంత సవాల్ గా ఉంటుందో తెలుస్తుందని అన్నాడు. 

అయితే, అన్ని ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నవారికి మాత్రం గుడ్ లక్ అని ఆయన అన్నారు. తన వరకు ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలను పెట్టుకుని తరుచుగా ప్రాయణాలు చేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని ఆయన అన్నాడు. ఒక్క ఫార్మాట్ నుంచి తప్పుకుంటే కొంత ఊరట లభిస్తుందని అన్నాడు. 

బీబీఎల్ లో ఆడకపోవడంపై కూడా ఆయన స్పందించాడు. కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతి సిరీస్ కు మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేసినట్లు తెలిపాడు.