మూడో వన్డేలో టీమిండియా ఓటమి! రోహిత్, విరాట్ పోరాడినా... పరువు కాపాడుకున్న ఆసీస్...

India vs Australia: 4 వికెట్లు తీసి టీమిండియాని దెబ్బ తీసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... 81 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 56 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 48 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్...

 

Australia beats Team India in Rajkot odi,  ends odi series with win before ICC World cup 2023 CRA

రాజ్‌కోట్‌లో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో పోరాడినా, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులతో పర్వాలేదనిపించినా మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు, 49.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 286 పరుగులే చేయగలిగింది.. రెండు వన్డేల్లో ఓడిన ఆసీస్, మూడో వన్డేలో 66 పరుగులతో గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. 

వాషింగ్టన్‌ సుందర్‌తో ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ, 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తొలి వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. 30 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు సుందర్..రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రోహిత్ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రావడమే కష్టమైపోయింది. 60 బంతుల్లో వన్డేల్లో 66వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. హాఫ్ సెంచరీ తర్వాత స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి నాలుగో వికెట్‌కి 52 పరుగులు జోడించారు. 30 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
 
43 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ కూడా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 పరుగులు చేసిన కుల్దీప్‌ని హజల్‌వుడ్, 5 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రాని ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశారు.. కొన్నాళ్లుగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్న రవీంద్ర జడేజా, 14 నెలల తర్వాత వన్డేల్లో సిక్సర్ బాదాడు. 

36 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, తన్వీర్ సంఘా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సిరాజ్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 96, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రాకి 3 వికెట్లు దక్కగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తలా ఓ వికెట్ దక్కింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios