Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరవవుతున్న ఆసీస్...

Australia vs Sri Lanka 1st Test: రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకి కుప్పకూలిన శ్రీలంక... ఆస్ట్రేలియా ముందు 5 పరుగుల లక్ష్యం... నాలుగు బంతుల్లో టార్గెట్‌ని ఛేదించిన ఆసీస్...

 

Australia beats Sri Lanka in 1st Test, stepping ahead World Test Championship final
Author
India, First Published Jul 1, 2022, 12:59 PM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌ని ఫైనల్ చేరే అవకాశాన్ని దురదృష్టవశాత్తు కోల్పోయింది ఆస్ట్రేలియా. కరోనా కారణంగా సౌతాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఈ సారి మాత్రం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.. యాషెస్ సిరీస్ 2021-22లో ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా జట్టు, పాకిస్తాన్ పర్యటనలో 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా...

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 59 ఓవర్లలో 212 పరుగులకి ఆలౌట్ అయ్యింది. డిక్‌వాలా 59 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేయగా ఏంజెలో మాథ్యూస్ 71 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ 5 వికెట్లు తీయగా స్వీప్సన్ 3 వికెట్లు పడగొట్టాడు...

తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా 130 బంతుల్లో 7 ఫోర్లతో 71 పరుగులు, కామెరూన్ గ్రీన్ 109 బంతుల్లో 6 ఫోర్లతో 77 పరుగులు చేయగా ఆలెక్స్ క్యారీ 47 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి రాణించడంతో 70.5 ఓవర్లలో 321 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా...

స్టీవ్ స్మిత్ 6 పరుగులు చేసి రనౌట్ కాగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 18 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్ రమేశ్ మెండీస్ 4 వికెట్లు తీయగా అసిత ఫెర్నాండో, జఫ్రే వండర్సే రెండేసి వికెట్లు తీశారు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 22.5 ఓవర్లలోనే 113 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 109  పరుగుల ఆధిక్యం పోగా ఆస్ట్రేలియా ముందు కేవలం 5 పరుగుల లక్ష్యం మాత్రమే పెట్టగలిగింది... కెప్టెన్ కరుణరత్నే 23, పథుమ్ నిశ్శంక 14, ఛండీమల్ 13, ఒసాడా ఫెర్నాండో 12 మినహా లంక బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు.

నాథన్ లియాన్ 4 వికెట్లు తీయగా ట్రావిస్ హెడ్ 2.5 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు. స్వీప్సన్‌కి రెండు వికెట్లు దక్కాయి. 5 పరుగుల టార్గెట్‌ని 4 బంతుల్లో ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా. రమేశ్ మెండీస్ బౌలింగ్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. 

ఈ విజయం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఆస్ట్రేలియాకి ఆరో విజయం. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 9 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా, 3 మ్యాచులను డ్రా చేసుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఆస్ట్రేలియా... సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్‌లతో టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios