లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా... నాలుగో ఇన్నింగ్స్‌లో 155 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన బెన్ స్టోక్స్.. 

బెన్ స్టోక్స్, టెస్టు టీమ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటూ ‘బజ్‌బాల్’ కాన్సెప్ట్‌తో దూసుకెళ్లింది ఇంగ్లాండ్. బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్‌లో దూకుడే మంత్రంగా సంచలన విజయాలు అందుకున్న ఇంగ్లాండ్‌కి ఆస్ట్రేలియా వరుస షాక్‌లు ఇస్తోంది..

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తొలి ఇన్నింగ్స్‌ని మొదటి రోజే డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్, దానికి భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇంగ్లాండ్ విధించిన లక్ష్యాన్ని 282 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చేధించింది ఆస్ట్రేలియా. తాజాగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఆసీస్..

371 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఇంగ్లాండ్, 327 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ డక్లెట్ 83 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ బెన్ స్టోక్స్ 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. జానీ బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా క్రీజు దాటి రనౌట్ అయ్యాక స్పీడ్ పెంచిన బెన్ స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి 108 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఇందులో బ్రాడ్ చేసింది 11 పరుగులే. 

ఇంగ్లాండ్ విజయానికి 70 పరుగులు కావాల్సిన సమయంలో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన బెన్ స్టోక్స్, యాషెస్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా డాన్ బ్రాడ్‌మెన్, హోబర్ట్ సుట్‌క్లిఫ్ రికార్డులను సమం చేశాడు..

నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు బెన్ స్టోక్స్. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 1999లో 149 పరుగులు చేయగా 2009లో డానియల్ విటోరీ 140 పరుగులు చేశాడు..

బెన్ స్టోక్స్ అవుటైన తర్వాతి ఓవర్‌లో ఓల్లీ రాబిన్‌సన్ (1 పరుగు), ఆ తర్వాతి ఓవర్‌లో స్టువర్ట్ బ్రాడ్ (11 పరుగులు) అవుట్ అయ్యారు. 302 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్ కలిసి 6 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసినా 19 పరుగులు చేసిన జోష్ టంగ్‌ని మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 327 పరుగులకు తెరపడింది...

బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి.