ఆరోన్ ఫించ్ స్థానంలో మిచెల్ మార్ష్‌కి టీ20 కెప్టెన్సీ... టీ20 ఫార్మాట్‌లోకి స్టీవ్ స్మిత్ రీఎంట్రీ! సౌతాఫ్రికా, టీమిండియాలతో వన్డే సిరీస్‌లకు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 

రెండు నెలల ముందే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి జట్టును ప్రకటించేసింది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్‌ టూర్‌లో టీమిండియాని ఓడించి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్‌ని 2-2 తేడాతో నిలబెట్టుకోగలిగింది. ఈ నెల చివర్లో సౌతాఫ్రికాకి, ఆ తర్వాత ఇండియాకి రాబోతున్న ఆస్ట్రేలియా జట్టు, ఈ రెండు సిరీస్‌లకు, ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఒకేసారి జట్టును ప్రకటించేసింది..

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్‌తో టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, వన్డేల్లోనూ సారథిగా వ్యవహరించబోతున్నాడు. టీ20లకు కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. సౌతాఫ్రికా, టీమిండియాలతో వన్డే సిరీస్‌లకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో, టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ మార్నస్ లబుషేన్‌కి చోటు దక్కలేదు..

ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉంటాడు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌‌లతో పాటు సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో మూడు టీ20 మ్యాచులు ఆడే ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది.

సెప్టెంబర్ 17న సౌతాఫ్రికా పర్యటనను ముగించుకుని, సెప్టెంబర్ 22 నుంచి టీమిండియాతో వన్డే సిరీస్ ఆడుతుంది. మొహాలీలో సెప్టెంబర్ 22న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24న ఇండోర్‌లో రెండో వన్డే, సెప్టెంబర్ 27న రాజ్‌కోట్‌లో మూడో వన్డే జరుగుతాయి..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత ఇండియాలోనే ఉండే ఆస్ట్రేలియా.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీని దృష్టిలో పెట్టుకుని, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది. నవంబర్ 23న ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్, డిసెంబర్ 3న ముగుస్తుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్‌తో కలిసి స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతుంది ఆస్ట్రేలియా. టీమిండియా, సౌతాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.. 

సౌతాఫ్రికా, టీమిండియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు ఆస్ట్రేలియా జట్టు ఇది: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి అందుబాటులో ఉండడు), జోష్ ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, సీన్ అబ్బాట్, అస్టన్ అగర్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్, నాథన్ ఎల్లీస్‌

కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన వన్డే సిరీస్‌లో ఆడడు. 

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇది: మాట్ షార్ట్, జోష్ ఇంగ్లీష్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆరోన్ మార్డీ, సీన్ అబ్బాట్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా