టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో  ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇండియన్ కుర్రాడు.. ఆస్ట్రేలియన్ యువతికి ప్రపోజ్ చేశాడు.

భారత ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్‌లో ఓ రొమాంటిక్ సన్నివేశం జరిగింది. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకుల మధ్య నుంచి లేచిన ఓ భారత అభిమాని మోకళ్లపై కూర్చుని ఆసీస్ జట్టు అభిమాని అయిన తన పార్ట్‌నర్‌కు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజ్‌ను ఆమె అంగీకరించింది. 

 

అది చూసిన ప్రేక్షకులు కేరింతలు, కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. బాయ్‌ఫ్రెండ్ ప్రేమను అంగీకరించిన ఆమె అతడిని కౌగిలించుకుని ముద్దుపెట్టింది. బౌండరీ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆ జంటను చూసి నవ్వుతూ అభినందించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియన్ కాగా.. ఆయన భార్య ఇండియన్ యువతి అన్న విషయం అందరికీ తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. నిన్నటి మ్యాచ్ లో భారత్ ఓటమిపాలయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరు చేయగా.. భారత్ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులే చేసింది. దీంతో ఆసీస్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.