Asianet News TeluguAsianet News Telugu

టీ20 ప్రపంచ క‌ప్ 2024 లో సంచ‌ల‌నం.. ఆసీస్ పై గెలిచి చ‌రిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్

Afghanistan secure historic win vs Australia: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో సూప‌ర్ 8 మ్యాచ్‌లో రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌పంచ క‌ప్ పోటీలో సజీవంగా నిలిచింది. 
 

AUS vs AFG: Afghanistan secure historic win vs Australia to stay alive in T20 World Cup 2024 RMA
Author
First Published Jun 23, 2024, 10:13 AM IST | Last Updated Jun 23, 2024, 10:13 AM IST

Afghanistan vs Australia : టీ20 వరల్డ్ కప్ 2024 48వ మ్యాచ్ సూప‌ర్-8 లో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్లు  త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ నాయ‌క‌త్వంలోని ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టు ఆస్ట్రేలియాను ఓడించి చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డే ప్రపంచ కప్ 2023లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అఫ్గానిస్థాన్ విజయంతో ఆసీస్ సెమీఫైనల్ భవితవ్యం కూడా చిక్కుల్లో పడింది. ఒకప్పుడు ఆస్ట్రేలియాకు బ్యాలెన్స్‌గా ఉన్న మ్యాచ్‌ను గుల్బాదిన్ నైబ్ ఒంటిచేత్తో తిప్పేశాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్‌లను ఒకరి తర్వాత ఒకరు వ‌రుస‌గా పెవిలియన్‌కు పంపాడు. 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓట‌మిని శాసించాడు.

ఆస్ట్రేలియాలో బిగ్ స్టార్లు.. ఈజీ టార్గెట్ కానీ..

ఆఫ్ఘనిస్థాన్ ఉంచిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేద‌న ఆస్ట్రేలియాకు సులువుగానే అనిపించింది. కానీ, ఊహించ‌ని విధంగా గుల్బాదిన్ నైబ్ (20 పరుగులకు 4 వికెట్లు), నవీన్ ఉల్ హక్ (20 పరుగులకు 3 వికెట్లు) అద్భుత‌మైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్‌ను పూర్తిగా ఆఫ్ఘ‌న్ వైపు తీసుకువ‌చ్చారు. 20 ఓవ‌ర్లు పూర్తి కాక‌ముందే ఆస్ట్రేలియా 127 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ పోరాడినా మ‌రో ఆట‌గాడు ఏవ‌రూ స‌హ‌కారం అందించ‌క‌పోవ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. 59 పరుగులు చేసిన తర్వాత మ్యాక్స్‌వెల్ ఔట్ అయ్యాడు. మిగతా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లు ఫ్లాప్‌ అయ్యారు. ఖాతా కూడా తెరవకుండానే ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్ మార్ష్ 12 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. టిమ్ డేవిడ్ (2 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (11 పరుగులు) క్రీజులో ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయారు.

ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ ఫలించలేదు..

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ అర్ధ సెంచరీలు చేసి 118 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. కానీ స్టోయినిస్ గుర్బాజ్ (60 పరుగులు)ను అవుట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత జద్రాన్ (51 పరుగులు) కూడా తొందరగానే ఔటయ్యాడు. పాట్ కమ్మిన్స్ మునుపటి మ్యాచ్‌లోని ఫీట్‌ను పునరావృతం చేసి టోర్నీలో రెండో హ్యాట్రిక్ సాధించాడు. 18వ ఓవర్ చివరి బంతికి, 20వ ఓవర్ తొలి రెండు బంతుల్లో వికెట్లు తీసి ఆఫ్ఘనిస్థాన్ భారీ స్కోరు దిశగా పయనించకుండా అడ్డుకున్నాడు. అయితే, కమిన్స్ ఈ హ్యాట్రిక్ ప్రయోజనం ఇవ్వ‌లేక‌పోయింది.

సెమీ-ఫైనల్ ఉత్కంఠ.. 

అఫ్గానిస్థాన్‌ ఈ విజయంతో సెమీఫైనల్ రేసులో ఇంకా స‌జీవంగానే ఉంది. భారత్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం. అదే సమయంలో ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్ భారత్‌తో జరగనుంది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవాలి. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ తర్వాతి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అఫ్గానిస్థాన్ కూడా సెమీస్ రేసులో ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే రన్ రేట్ కీల‌కం కానుంది. ఎందుకంటే ఇద్దరికీ 4 పాయింట్లు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉంటాయి, అయితే రన్ రేట్ మరింత మెరుగ్గా ఉంటే సెమీఫైనల్‌కు చేరుకోవడం సులభం అవుతుంది.

 

 

ఉన్నంత సేపు ఇర‌గ‌దీశాడు.. ప్ర‌పంచ క‌ప్ లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios