హాఫ్ సెంచరీ తర్వాత టీషర్టు పైకెత్తి టాటూ చూపించిన తిలక్ వర్మ... అమ్మకి మాటిచ్చానంటూ...
బంగ్లాదేశ్‌తో సెమీ ఫైనల్‌లో అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ.. హాఫ్ సెంచరీ తర్వాత మరోసారి వెరైటీ సెలబ్రేషన్స్..
టీమిండియాలోకి వస్తూనే అదరగొడుతున్నాడు గుంటూరు కుర్రాడు తిలక్ వర్మ. ఏషియన్ గేమ్స్ 2023 పోటీలకు ఎంపికైన తిలక్ వర్మ, బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు..
వెస్టిండీస్ టూర్‌లో టీ20 ఆరంగ్రేటం చేసి మెప్పించిన తిలక్ వర్మ, ఆసియా కప్ 2023 టోర్నీకి కూడా ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. టోర్నీలో బంగ్లాదేశ్‌తో ఓ వన్డే ఆడి 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఏషియన్ గేమ్స్‌లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ 10 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
చాలామంది యంగ్ క్రికెటర్ల మాదిరిగా తిలక్ వర్మ కూడా వన్ సిరీస్ వండర్‌గా మారిపోతాడా? అనే అనుమానాలు రేగాయి. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు తిలక్ వర్మ..
21 ఏళ్ల వయసులో రెండు అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు తిలక్ వర్మ. హాఫ్ సెంచరీ తర్వాత తిలక్ వర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ అందరికీ వెరైటీగా అనిపించాయి. మొదటి టీ20 హాఫ్ సెంచరీ చేసినప్పుడు చిన్నపాపను ఉయ్యాల ఊపుతున్నట్టుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు తిలక్ వర్మ..
ఈసారి టీషర్ట్ పైకి ఎత్తు తన పక్కటెముకలకు ఉన్న టాటూని చూపించాడు. మ్యాచ్ అనంతరం ఈ సెలబ్రేషన్స్ గురించి వివరణ ఇచ్చాడు తిలక్ వర్మ.
‘ఆ సెలబ్రేషన్స్ మా అమ్మ కోసం చేశాను. ఎందుకంటే గత కొన్ని మ్యాచులుగా నేను బాగా ఆడలేకపోయాను. నేను తర్వాతి మ్యాచ్ గెలిపించి, టీవీలో నిన్ను చూపిస్తానని మాటిచ్చాను. హాఫ్ సెంచరీ చేయగానే ఇలా సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పాను. నా బెస్ట్ ఫ్రెండ్ సమీకి (రోహిత్ శర్మ కూతురు సమైరా) కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగం చేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు తిలక్ వర్మ..
తిలక్ వర్మ తన పక్కటెముకల మీద తల్లిదండ్రుల ఫోటోలను టాటూగా వేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత తల్లి టాటూని తాకుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. బౌలింగ్‌లో కూడా తిలక్ వర్మ ఓ వికెట్ పడగొట్టాడు. యశస్వి జైస్వాల్ డకౌట్ అయినా 9.2 ఓవర్లలో టార్గెట్‌ని ఛేదించిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.