ఏషియన్ గేమ్స్ 2023: వర్షంతో రద్దైన ఇండియా - ఆఫ్ఘాన్ ఫైనల్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
ఫలితం తేలకుండానే రద్దు అయిన ఇండియా- ఆఫ్ఘానిస్తాన్ ఫైనల్ మ్యాచ్.. మెరుగైన ర్యాంకులో ఉన్న భారత్‌కి స్వర్ణం దక్కగా ఫైనల్ చేరిన ఆఫ్ఘాన్‌కి రజత పతకం..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల టీ20 క్రికెట్ పోటీల్లో ఇండియా- ఆఫ్ఘాన్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. మెరుగైన ర్యాంకులో ఉన్న భారత్‌కి స్వర్ణం దక్కగా ఫైనల్ చేరిన ఆఫ్ఘాన్‌కి రజత పతకం దక్కింది..
వర్షం కారణంగా 20 నిమిషాలు ఆలస్యంగా టాస్ జరిగింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత భారత బౌలర్లు అదరగొట్టడంతో 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్..
జుబేద్ ఆక్బరీ 5, మహ్మద్ షాజాద్ 4, నూర్ ఆలీ జాద్రాన్ 1, ఆఫ్సర్ జజయ్ 15, కరీం జనత్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు. అయితే షాహీదుల్లా కమల్, కెప్టెన్ గుల్బాదీన్ నయిబ్ కలిసి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్. షాహీదుల్లా కమల్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా గుల్బాద్దీన్ నయిబ్ 24 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి క్రీజులో నిలిచారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
మొట్టమొదటిసారి ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్ట, పురుషుల, మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు గెలిచింది..