Asia Cup 2023: పాక్‌పై టీమిండియా అద్భుత విజయం.. రివెంజ్ కోసం రిజర్వు డే పెట్టి..
India vs pakistan: 128 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్.. 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్..
ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది టీమిండియా. మిగిలిన మ్యాచులకు కాదని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే ఎందుకు పెట్టారో చూపిస్తూ.. పాక్‌ని అన్ని విభాగాల్లో చిత్తు చేసింది భారత జట్టు. బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో తేలిపోయిన పాక్.. 357 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌లోనూ చేతులు ఎత్తేసింది. ఫలితంగా 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది టీమిండియా. 32 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది పాకిస్తాన్. హారీస్ రౌఫ్, నసీం షా రిటైర్ హార్ట్‌గా బ్యాటింగ్‌కి రాకపోవడంతో భారత జట్టుకి ఘన విజయం దక్కింది...
కొండంత టార్గెట్ ముందుండడంతో పాకిస్తాన్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. 18 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
24 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. 43 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ అవుట్ కాగానే వర్షం రావడంతో కాసేపు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్..
5 బంతుల్లో 2 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కుల్దీప్ బౌలింగ్‌లో ఫకార్ ఇచ్చిన క్యాచ్‌ని రోహిత్ శర్మ జారవిడిచాడు. అయితే ఆ అవకాశాన్ని ఫకార్ జమాన్ ఉపయోగించుకోలేకపోయాడు.
50 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన ఫకార్ జమాన్, కుల్దీప్ యాదవ్ తర్వాత ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఓ బంతి, ఆఘా సల్మాన్ ముఖానికి బలంగా తగిలింది. గాయమై రక్తం కారినా, గ్రౌండ్‌లోనే చికిత్స తీసుకుని తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు ఆఘా సల్మాన్..
32 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన ఆఘా సల్మాన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
10 బంతుల్లో 6 పరుగులు చేసిన షాదబ్ ఖాన్‌ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, 35 బంతుల్లో 23 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్‌ని కూడా పెవిలియన్‌కి పంపాడు. 12 బంతుల్లో 4 పరుగులు చేసిన ఫహీం ఆష్రఫ్‌ని కుల్దీప్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కి తెరపడింది.
టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో గాయపడిన హారీస్ రౌఫ్, నసీం షా బ్యాటింగ్‌కి రాకపోవడంతో 128/8 పరుగులకే పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. .కుల్దీప్ యాదవ్ 25 పరుగులకే 5 వికెట్లు పడగొట్టగా బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.