వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... దునిత్ వెల్లలాగే స్పిన్ మ్యాజిక్‌కి రోహిత్, విరాట్, గిల్...
India vs Sri Lanka: 80/0 స్కోరు నుంచి 91/3 స్థితికి చేరుకున్న భారత జట్టు.. 3 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. హాఫ్ సెంచరీ చేసి అవుటైన రోహిత్ శర్మ..
ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే... టీమిండియా టాపార్డర్ బ్యాటర్లను తన స్పిన్ మ్యాజిక్‌తో పెవిలియన్ చేర్చాడు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించిన తర్వాత శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు..
25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 3 పరుగులు చేసి, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లోనే దసున్ శనకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
మరో ఎండ్‌లో 44 బంతుల్లో వన్డేల్లో 51వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ. వన్డేల్లో 10 వేల పరుగుల క్లబ్‌లో చేరిన రోహిత్ శర్మ, భారత జట్టు తరుపున సచిన్, కోహ్లీ, గంగూలీ, ద్రావిడ్, ధోనీ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు..
241 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (205 ఇన్నింగ్స్‌లు) తర్వాత అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు..
11 ఓవర్లు ముగిసే సమయానికి 80/0 స్కోరుతో ఉన్న టీమిండియా, 15.1 ఓవర్లకు వచ్చే సరికి 91/3 స్థితికి చేరుకుంది. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన దునిత్ వెల్లలాగే, ఓ మెయిడిన్‌తో 4 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు..