జడ్డూ దెబ్బకి ఆఘా సల్మాన్‌‌కి తీవ్ర గాయం... గ్రౌండ్‌లోనే కుట్లు! ఒకే మ్యాచ్‌లో ముగ్గురు పాక్ ప్లేయర్లకు..

గాయంతో బౌలింగ్‌కి రాని హారీస్ రౌఫ్.. బౌలింగ్ చేస్తూ గాయపడిన నసీం షా... బ్యాటింగ్ చేస్తూ గాయపడిన ఆఘా సల్మాన్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు పాక్ ప్లేయర్లకు గాయాలు.. 

Asia Cup 2023: Agha Salman bleeds after the ball hit near his eyes in Ravindra Jadeja bowling, India vs Pakistan CRA

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి అస్సలు అదృష్టం కలిసి రావడం లేదు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్ మీద టాస్ గెలిచి, టీమిండియాకి బ్యాటింగ్ అప్పగించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేసింది భారత జట్టు..

భారత ఇన్నింగ్స్ సగం ముగిసిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్ రిజర్వు డేకి వాయిదా పడింది. గాయంతో పాక్ సీనియర్ పేసర్ హారీస్ రౌఫ్, నేటి మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. దీంతో ఇఫ్తికర్ అహ్మద్‌తో 5 ఓవర్లు వేయించి, అతని కోటా పూర్తి చేయించాడు బాబర్ ఆజమ్..

ఇది చాలదన్నట్టుగా నసీం షా కూడా బౌలింగ్ చేస్తూ గాయంతో పెవిలియన్ చేరాడు. తన కోటాలో చివరి ఓవర్‌‌లో 2 బంతులు మాత్రమే వేసి క్రీజు వీడాడు నసీం షా. దీంతో మిగిలిన 4 బంతులు వేసేందుకు మళ్లీ ఇఫ్తికర్ అహ్మద్‌ని పిలవాల్సి వచ్చింది..

ఇది చాలదన్నట్టుగా పాక్ బ్యాటింగ్ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆఘా సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో ఓ బంతి నేరుగా వచ్చి, ఆఘా సల్మాన్ ముఖానికి తగిలింది. బంతి వేగానికి ఆఘా సల్మాన్ కంటి కింద చిట్లి, రక్తం కారింది. 

గ్రౌండ్‌లోకి వచ్చిన ఫిజియో, అక్కడే కుట్లు వేసి చికిత్స చేశాడు. కట్టు కట్టిన తర్వాత ఆఘా సల్మాన్ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. సాధారణంగా అయితే ఇలాంటి గాయం తగిలితే ఆ బ్యాటర్ రిటైర్ హార్ట్‌గా పెవిలియన్ వెళ్తాడు. అతని స్థానంలో మరో బ్యాటర్ బ్యాటింగ్‌కి రావాల్సి ఉంటుంది. అయితే అప్పటికే టాపార్డర్ బ్యాటర్లు అవుట్ కావడంతో ఆఘా సల్మాన్, డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లడానికి ఇష్టపడలేదు.

అదీకాకుండా అప్పటికి 21 ఓవర్లు మాత్రమే పూర్తి కావడంతో వర్షం కోసం సమయాన్ని వృధా చేసేందుకు కూడా ట్రీట్‌మెంట్ పేరుతో కాలక్షేపం చేసింది పాకిస్తాన్. అయితే ఈ వ్యూహం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. గాయం తర్వాత 2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆఘా సల్మాన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన ఆఘా సల్మాన్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్లు, ఓ బ్యాటర్ గాయపడడం పాకిస్తాన్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకునే హారీస్ రౌఫ్, నసీం షా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదని కూడా తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios